డిజిటల్ న్యూస్ మీడియాను నియంత్రించేలా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నిబంధనలపై స్టే ఇవ్వడం కుదరదని దిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. దీనిపై పిటిషనర్ వాదనతో ఏకీభవించలేమని తేల్చి చెప్పింది.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిబంధనలను పాటించాలని.. ఫౌండేషన్ ఫర్ ఇండిపెండెంట్ జర్నలిజం, ది వైర్, క్వింట్ డిజిటల్ మీడియా లిమిటెట్, ఆల్ట్ న్యూస్ మాతృసంస్థ ప్రవ్ధ మీడియా ఫౌండేషన్లకు.. కేంద్రం ఇటీవల నోటీసులు జారీ చేసింది. లేకపోతే ఆయా సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది.
ఈ నేపథ్యంలో వార్తా సంస్థలు కోర్టును ఆశ్రయించాయి. దీనిపై వాదనలు విన్న జస్టిస్ సీ. హరి శంకర్, జస్టిస్ సుబ్రహ్మణియం ప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం.. నిబంధనల అమలుపై స్టే ఇవ్వడం కుదరదని స్పష్టం చేసింది.
"మీ వాదనతో మేము ఏకీభవించలేము. మీకు కావాలంటే సహేతుకమైన, వివరణాత్మకమైన ఉత్తర్వులు జారీ చేస్తాము. లేదంటే పిటిషన్‌ను రోస్టర్ బెంచ్‌కు నోటిఫై చేస్తాం. నోటీసుల్లో ఉన్న విషయాలను పూర్తిగా పరిశీలించి, తిరిగి మాకు తెలియజేయండి"
-దిల్లీ హైకోర్టు
అనంతరం.. పిటిషనర్ల అభ్యర్థన మేరకు విచారణను జులై 7కు వాయిదా వేసింది దిల్లీ హైకోర్టు.
ఇదీ చూడండి: ఫేస్బుక్, గూగుల్‌కు కేంద్రం సమన్లు