Delhi Hanuman Jayanti Violence: దిల్లీలో హనుమాన్ జయంతి సందర్భంగా జరిగిన శోభాయాత్రంలో హింసాత్మక ఘటనసు చోటుచేసుకున్నాయి. వాయవ్య దిల్లీలోని జహంగీర్‌పుర్ ప్రాంతంలో ఊరేగింపు జరుగుతున్నప్పుడు కొందరు రాళ్లు రువ్వడం వల్ల హింస చెలరేగిందని పోలీసులు తెలిపారు. ఈ దాడిలో పలువురు పోలీసులు గాయపడ్డారని తెలిపారు. కొన్ని వాహనాలను దుండగులు తగలబెట్టారని పేర్కొన్నారు.
"దేశ రాజధానిలో శాంతిభద్రతలు కాపాడాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది. ప్రజలంతా సంయమనం పాటించాలి. లెఫ్టినెంట్ గవర్నర్‌తో ఫోన్లో మాట్లాడా. శాంతి భద్రతల కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నాం. దోషులను వదిలే ప్రసక్తే లేదు."
-అరవింద్ కేజ్రీవాల్, దిల్లీ ముఖ్యమంత్రి

"అల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటాం.పరిస్థితి అదుపులో ఉంది. జహంగీర్‌పురి, ఇతర సున్నితమైన ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరిస్తాం. సీనియర్ అధికారులు క్షేత్రస్థాయిలో ఉండి శాంతిభద్రతలను నిశితంగా పర్యవేక్షించి పెట్రోలింగ్ చేపట్టాలి. సోషల్ మీడియాలో పుకార్లు, తప్పుడు వార్తలను పౌరులు పట్టించుకోవద్దు."
-రాకేశ్ ఆస్తానా, దిల్లీ పోలీస్ కమిషనర్
కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా దిల్లీ పోలీసు కమిషనర్‌తో మాట్లాడి హింసకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. దిల్లీ పోలీసులు.. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులకు సమాచారం అందించారని పేర్కొన్నాయి. హోంశాఖ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోందని, దిల్లీ పోలీసులకు కేంద్ర హోంశాఖ అవసరమైన ఆదేశాలు ఇచ్చిందని ప్రభుత్వ అధికార వర్గాలు వెల్లడించాయి. మరోవైపు దిల్లీలో ఘర్షణ నేపథ్యంలో ఉత్తర్‌ప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల అధికారులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.
ఇదీ చదవండి: నదీతీరమే తరగతి గది... ప్రభుత్వ ఉద్యోగార్థులకు ఫ్రీ కోచింగ్!