Staff Leave cancel: దిల్లీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులు తప్పనిసరిగా విధులకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. అత్యసరమైతే తప్ప సెలవులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఒక్కరోజు వ్యవధిలోనే కొవిడ్ కేసులు సంఖ్య రెట్టింపు కావడం, పాజిటివిటీ రేటు 11.88 చేరింది. నేపథ్యంలో తగినంత సిబ్బంది అవసరమన్న సర్కారు.. అన్ని విభాగాల ప్రభుత్వ ఉద్యోగులు విధులకు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది.
"నగరంలో కరోనా నియంత్రణకు ప్రభుత్వంలో పలు స్థాయిల్లో సిబ్బంది భారీగా అవసరం. అందువల్ల అత్యవసరమైతే తప్ప అన్ని విభాగాల ఉద్యోగుల సెలవులు రద్దు చేస్తున్నాం. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఇది అమల్లో ఉంటుంది" అని దిల్లీ సర్కారు జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.
దేశ రాజధానిలో రాత్రి, వారాంతపు కర్ఫ్యూలు విధిస్తున్నప్పటికీ.. కొన్ని రోజులుగా కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. బుధవారం ఒక్కరోజే దిల్లీలో 10 వేల మందికిపైగా కొవిడ్ సోకింది. గతేడాది మే 12 తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.
వైద్య సిబ్బంది సెలవులు రద్దు
జమ్ము డివిజన్‌లో కొవిడ్-19 కేసులు అకస్మాత్తుగా పెరగడం వల్ల వైద్య సిబ్బంది సెలవులను రద్దు చేసినట్లు అధికారిక ప్రతినిధి ఒకరు తెలిపారు. వైద్య పరికరాల నిల్వలు పెంచాలని.. మౌలిక సదుపాయాలను మెరుగుపరుచుకోవాలని వైద్య విభాగానికి ఉన్నతాధికారులు సూచించినట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: మహిళా హక్కుల కార్యకర్త బిందు అమ్మినిపై దాడి!