నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనకు బహిరంగ మద్దతు తెలిపిన కేజ్రివాల్ ప్రభుత్వం.. ఆ చట్టాల్లో ఒక దానిని నోటిఫై చేయడం విమర్శలకు తావిచ్చింది. రైతులు తమ పంట ఎక్కడైనా అమ్ముకునేలా కేంద్రం తీసుకొచ్చిన ట్రేడ్ అండ్ కామర్స్ ఆర్డినెన్స్ -2020 చట్టాన్ని ఆమోదించినట్లు దిల్లీ అధికారులు తెలిపారు. మిగిలిన రెండు చట్టాలను పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నిర్ణయంపై భాజపా, కాంగ్రెస్ మండిపడ్డాయి. వ్యవసాయ చట్టాలపై కేజ్రివాల్ ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని విరుచుకుపడ్డాయి.
ఒకవైపు రైతుల ఆందోళనలకు బహిరంగంగా మద్దతు తెలుపుతున్న కేజ్రీవాల్ సర్కార్, మరోవైపు వ్యవసాయ చట్టాల ద్వారా కలిగే ప్రయోజనాలను సైతం పొందాలని చూస్తోందని భాజపా ఎంపీ మనోజ్ తివారీ ఆరోపించారు. ఇది కేజ్రీవాల్ ప్రభుత్వ నకిలీ వైఖరికి అద్దం పడుతోందని విమర్శించారు. అయితే రైతుల నిరసనలు నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు భాజపా ప్రయత్నిస్తోందని ఆమ్ ఆద్మీ ప్రభుత్వం పేర్కొంది.
పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ కూడా ఆప్ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. రైతుల ఆందోళనలకు మద్దతు తెలుపుతున్న కేజ్రీవాల్ ప్రభుత్వం ఈ చట్టాన్ని ఆమోదించడమేంటని మండిపడ్డారు. ఓ వైపు రైతులకు మద్దతు తెలుపుతున్నామని చెబుతూనే భాజపాతో కేజ్రీవాల్ చేతులు కలిపారని ఆరోపించారు. ఆయన 'భాజపా సీఎం' అని ధ్వజమెత్తారు.
రైతు వ్యతిరేక చట్టాన్ని కేజ్రీవాల్ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్ కోఆర్డినేషన్ కమిటీ(ఏఐకేఎస్‌సీసీ) విజ్ఞప్తి చేసింది. కర్షకులకు పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు స్పష్టం చేయాలని సూచించింది.
ఇదీ చూడండి: కొలిక్కిరాని చర్చలు- కేంద్రం ప్రతిపాదనకు రైతులు నో