యమునా నదిలో పారిశ్రామిక విషపు నురగలను (pollution in yamuna river) తొలగించడానికి కాళింది ఘాట్ వద్ద దిల్లీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఘాట్ వద్దకు నురగలు చేరకుండా సిబ్బంది వెదురు తడకలు అడ్డుపెడుతున్నారు. అవి విచ్ఛిన్నం అయ్యేలా నీటి తుంపరలను ఉపయోగిస్తున్నారు. మురుగునీటిని శుద్ధి చేసే ప్లాంట్లను ఆధునికీకరించనంతవరకు నురగ సమస్య ఆగిపోదని అధికారులు చెబుతున్నారు. సుధీర్ఘంగా కొనసాగుతున్న ఈ సమస్యకు తక్షణ పరిష్కారం లేదని తెలిపారు. అటు.. నీటి తుంపరలను వాడుకునే మార్గం తప్ప వేరే దారి లేదని దిల్లీ జల్ బోర్డ్ తెలిపింది.
నిషేధం ఉందని తెలియక..
కరోనా ఆంక్షల్లో భాగంగా యమునా నది ఒడ్డున ఛఠ్ వేడుకలను గతంలోనే నిషేధించింది దిల్లీ ప్రభుత్వం. ఈ విషయం తెలియని కొంతమంది భక్తులు మంగళవారం (chhath puja in yamuna river) ఛఠ్ పూజల్లో పాల్గొన్నారు. పారిశ్రామిక వాడల నుంచి విడుదలైన విషపు నురగల మధ్యే పుణ్యస్నానాలు ఆచరించారు. దీంతో దిల్లీలో కాలుష్యం మరోసారి తెరమీదికి వచ్చింది. ప్రభుత్వం అనంతరం దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది.
అటు ఛఠ్ పూజకు నిషేధం ఉన్న నేపథ్యంలో ఘాట్లోకి భక్తులు ప్రవేశించకుండా పోలీసులు బారికేడ్లు అడ్డుగా పెట్టారు. నదిలోకి భక్తులను అనుమతించడం లేదు. ఛఠ్ పూజలకు అనుమతి లేదనే విషయం తెలియక చాలా మంది భక్తులు ఘాట్ వద్దకు చేరుకుంటున్నారు.
ముదురుతున్న రాజకీయం..
నురగల మధ్య ఛఠ్ పూజకు సంబంధించిన భక్తుల ఫొటోలు మీడియాలో ప్రచారం కావడంతో దిల్లీలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి, భాజపాకు మధ్య రాజకీయ వాతావరణం వేడెక్కింది. దీల్లీ ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి (bjp vs AAP) ఛఠ్ పూజకు అనుమతించడం లేదని కాళీంది కుంజ్ ఛఠ్ పూజ సమితి ఛైర్మన్ వికాస్ రాయ్ ఆరోపించారు. 'నీటి తుంపరల వాడకం నురగను తొలగించలేదు. కాలుష్యంపై విమర్శలు రాకుండా కేవలం కంటితుడుపు చర్యలను ప్రభుత్వం తీసుకుంటోంది' అని విమర్శించారు. అటు ఉత్తర్ప్రదేశ్, హరియాణాలో పాలనలో ఉన్న భాజపా ప్రభుత్వాల వైఫల్యం వల్లే యమునా నది కలుషితమవవుతోందని ఆప్ ఆరోపిస్తోంది. పుణ్యస్నానాలు చేయకుండా బారికేడ్లు పెట్టినప్పటికీ యమునా ఘాట్లోకి వెళ్లారు పశ్చిమ దిల్లీ ఎంపీ పర్వేశ్ సాహెబ్ సింగ్. ఛఠ్ పూజలో పాల్గొన్నారు.
యమునా నదిలో 80 శాతం పారిశ్రామిక వ్యర్థాలు దిల్లీ ఒడ్డున్న 22 కిలోమీటర్ల మేర నదిలోనే కలుస్తున్నాయని దిల్లీ భాజపా అధ్యక్షుడు ఆదేష్ గుప్తా అన్నారు.
ఇదీ చదవండి:పునీత్ ద్వాదశ దినకర్మ- 40 వేల మంది అభిమానులు హాజరు