118 అర్జున్ మార్క్-1ఏ యుద్ధ ట్యాంకులను కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది రక్షణ శాఖ. ఇందుకోసం రూ.6వేల కోట్లను కేటాయించనుంది. అర్జున్ మార్క్-1ఏ యుద్ధ ట్యాంకును భారత ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం ఇచ్చిన కొద్ది రోజులకే రక్షణ శాఖ ఈ నిర్ణయం తీసుకోవటం ప్రాధాన్యం సంతరించుకుంది. త్రివిద దళాధిపతి బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవణె పాల్గొనే డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ సమావేశంలో రక్షణ మంత్రిత్వ శాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకోనుందని ఆర్మీ వర్గాలు పేర్కొన్నాయి.
ఈ యుద్ధ ట్యాంకులను భారత రక్షణ, పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) అభివృద్ధి చేస్తోంది. ఇప్పటికే 124 అర్జున్ యుద్ధ ట్యాంకులు భారత ఆర్మీలో చేరి పాకిస్థాన్ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్నాయి. ఇదే తరహాలోనే అర్జున్ మార్క్-1A యుద్ధ ట్యాంకులు సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తాయని సైనిక వర్గాలు పేర్కొన్నాయి.
భారత ఆర్మీలో స్వదేశీ ఆయుధ సంపత్తిని పెంచేందుకు త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్, డీఆర్డీఓ చీఫ్ డా. జీ. సతీశ్ రెడ్డి ఈ ప్రాజెక్ట్ను వేగవంతం చేశారు.
ఇదీ చదవండి : '500 మీటర్ల దూరంలో భారత్, చైనా సైన్యాలు'