12వ తరగతి పరీక్షలు సహా వృత్తివిద్యా కోర్సులకు ప్రవేశ పరీక్షల నిర్వహణ ప్రతిపాదనలపై చర్చించేందుకు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది కేంద్రం. కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ ఆధ్వర్యంలో.. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల విద్యాశాఖ మంత్రులు, కార్యదర్శులు, రాష్ట్రాల పరీక్షల బోర్డుల ఛైర్మన్లు, ఇతర సభ్యులతో వర్చువల్‌గా నిర్వహించిన ఈ భేటీకి రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షత వహించారు. పరీక్షల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై చర్చించారు.
విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో అనిశ్చితి తొలగించాలంటే.. పరీక్షల నిర్వహణపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అభిప్రాయపడ్డారు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్. ఈ క్లిష్టమైన కరోనా సమయంలో.. విద్యార్థులు, ఉపాధ్యాయుల భద్రత, భవిష్యత్తు ముఖ్యమని అన్నారు. పరీక్షల అంశంపై.. మే 25లోగా అన్ని రాష్ట్రాలు సమగ్ర సూచనలు తమకు అందించాలని కోరారు.
ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు ప్రకాశ్ జావడేకర్, స్మృతి ఇరానీ హాజరయ్యారు.
విద్యార్థులకు వ్యాక్సిన్ ఇవ్వకుండా పరీక్షలు నిర్వహించటం అతిపెద్ద పొరపాటు అవుతుందని హెచ్చరించారు దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా.
పరీక్షలు రద్దు చేయండి: ప్రియాంక గాంధీ
మరోవైపు.. కొవిడ్ రెండో దశ ఉద్ధృతితో పిల్లలపై ప్రభావం ఎక్కువగా ఉందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తెలిపారు. సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షలను నిర్వహించొద్దని ప్రభుత్వాన్ని కోరారు. నెలల తరబడి ఈ నిర్ణయాన్ని సాగదీస్తున్నారని కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ప్రస్తుత సమయంలో పరీక్షల నిర్వహణపై విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. వారి ఆరోగ్యం, భద్రతకు సంబంధించిన విషయమని పేర్కొంటూ ట్వీట్ చేశారు. గదుల్లో ఎక్కువ మంది ఉంటే వైరస్ వ్యాప్తికి ఎక్కువగా అవకాశం ఉందన్న హెచ్చరికల నుంచి ఎందుకు నేర్చుకోలేకపోతున్నామని ప్రశ్నించారు. ఇప్పటికే ఒత్తిడితో ఉన్న పిల్లలను గంటల తరబడి వ్యక్తిగత రక్షణతో కూర్చోమనటం అన్యాయమన్నారు.
ఇంటి నుంచే పరీక్ష..
12వ తరగతి పరీక్షలను విద్యార్థులు ఇంటి నుంచే రాసేవిధంగా చర్యలు చేపట్టింది ఛత్తీస్గఢ్ ప్రభుత్వం. ఇందుకు సంబంధించి ఆదేశాలు జారీచేసింది ఆ రాష్ట్ర విద్యాశాఖ.
ఇదీ చూడండి: భారత్లో కరోనా.. అంకెల్లో ఇలా..