బిహార్లో కల్తీ మద్యంతో సంభవిస్తున్న మరణాలకు (Bihar Hooch Tragedy) అడ్డుకట్ట పడటం లేదు. ఇప్పటికే గోపాల్గంజ్, బెతియా, సమస్తీపుర్ జిల్లాల్లో 40 మందికి పైగా మరణించగా.. తాజాగా ముజఫర్పుర్లోనూ కల్తీ మద్యం మరణాలు వెలుగులోకి వచ్చాయి. ఈ జిల్లాలో నలుగురు కల్తీ మద్యానికి (Bihar alcohol news) బలయ్యారు. సిర్సియా, బరియాపుర్ గ్రామాల్లో ఈ మరణాలు సంభవించాయి.
కల్తీ మద్యం (Bihar Hooch Tragedy) సేవించి మొత్తం తొమ్మిది మంది అస్వస్థతకు గురికాగా... హుటాహుటిన వీరందరినీ ఆస్పత్రికి తరలించారు. వీరిలో నలుగురు చికిత్స పొందుతూనే మరణించారు. మిగిలిన ఐదుగురిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.
బాధితుల గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో.. మద్యం ఏరులై పారుతోంది. ఈ క్రమంలోనే.. గ్రామంలో లిక్కర్ పార్టీ నిర్వహించినట్లు స్థానికులు కొందరు వెల్లడించారు. ఆ తర్వాతే చాలా మంది ఆరోగ్యం చెడిపోయిందని తెలిపారు.
'మరణించింది ఇద్దరే!'
అయితే, ఇద్దరి మరణాలు మాత్రమే తమ దృష్టికి వచ్చాయని ముజఫర్పుర్ ఎస్ఎస్పీ జయంత్ కాంత్ తెలిపారు. మరో ఇద్దరు ఆస్పత్రిలో ఉన్నట్లు చెప్పారు. పోస్టుమార్టం నివేదిక తర్వాత అసలు నిజాలు తెలుస్తాయని అన్నారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
ఇదీ చదవండి: కల్తీ మద్యం కలకలం.. మూడు రోజుల్లో 39 మంది మృతి