Dead Bodies in a well: రాజస్థాన్ జైపుర్ రూరల్లో సామూహిక ఆత్మహత్యలు కలకలం రేపాయి. ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారుల శవాలు నరేనా రోడ్ సమీపంలోని బావిలో కనిపించాయి. సమాచారం అందుకొని దుదూ స్టేషన్ పోలీసులు, అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ముగ్గురు మహిళలు అక్కాచెల్లెళ్లు అని పోలీసులు తెలిపారు. వీరిని కాలీ దేవి(27), మమతా దేవి(23), కమ్లేశ్ మీనాగా(20) గుర్తించారు. మే 25న ఇంట్లో నుంచి వారు బయటకు వెళ్లిపోయారని చెప్పారు. చనిపోయిన చిన్నారుల్లో నాలుగేళ్ల బాలుడు హర్షిత్, 20 రోజుల శిశువు ఉన్నట్టు వెల్లడించారు.
Dudu Sisters Death: మమతా దేవీ ఎనిమిది నెలల గర్భంతో ఉండగా.. కమ్లేశ్ తొమ్మిది నెలల నిండు గర్భిణీ. మృతురాళ్ల బంధువు హేమరాజ్ మీనా చెప్పిన వివరాల ప్రకారం.. ముగ్గురు అక్కాచెల్లెళ్లకు ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులతో వివాహం జరిగింది. వీరి అత్త.. మహిళలను తీవ్రంగా హింసించేది. పది రోజుల క్రితం వీరిని తీవ్రంగా కొట్టి ఇంట్లో నుంచి బయటకు గెంటేశారు. దీంతో తల్లిగారింటికి వచ్చేశారు ఈ ముగ్గురు మహిళలు. అత్తవారింటి సభ్యుల దాడిలో మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. గొడవను పరిష్కరించేందుకు మహిళల కుటుంబ సభ్యులు ప్రయత్నించినప్పటికీ.. ఫలించలేదు. ఈ ఒత్తిడితోనే మహిళలు తమ పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. మార్కెట్కు వెళ్తామని చెప్పి మే 25న ఇంటి నుంచి బయటకు వెళ్లిన మహిళలు.. తిరిగి రాలేదని పోలీసులు తెలిపారు.
మరోవైపు, ఈ ఘటనపై పోలీసులు సరిగా స్పందించలేదని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఫిర్యాదు నమోదు చేసుకునేందుకూ ముందుకురాలేదని అన్నారు. 24 గంటల పాటు ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పారు. దీంతో మహిళా కమిషన్ను ఆశ్రయించినట్లు హేమరాజ్ మీనా తెలిపారు. పోలీసు ఉన్నతాధికారులనూ కలిసినట్లు చెప్పారు. అయితే, ఉన్నతాధికారుల వద్ద ఫిర్యాదు చేయొద్దని స్థానిక ఎమ్మెల్యే తమపై ఒత్తిడి చేశారని వెల్లడించారు. గ్రామస్థులు ఘటనపై తీవ్ర నిరసన వ్యక్తం చేయడం వల్ల.. పోలీసులు స్పందించారని చెప్పారు. మరోవైపు, కట్నం కోసం తమను వేధించారని మృతురాళ్ల సోదరుడు.. వారి అత్తగారి కుటుంబంపై ఫిర్యాదు చేశారు.
UP missing girl dead: మరోవైపు యూపీలోని బదోహిలో 11 రోజుల క్రితం కనిపించకుండా పోయిన 16ఏళ్ల బాలిక శవమై తేలింది. ఓ బావిలో మృతదేహం కనిపించిందని పోలీసులు తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తులు బాలిక కాళ్లు, చేతులకు తాళ్లు కట్టేసి బావిలో పడేశారని చెప్పారు. బావిలో నుంచి దుర్గంధం వ్యాపించడం వల్ల.. శుక్రవారం రాత్రి ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బావి ఉన్న పొలం యజమాని ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు.
"బాలిక శవం ఓ గోనె సంచిలో ఉంది. 10-12 రోజుల క్రితం శవాన్ని బావిలో పడేసినట్లు తెలుస్తోంది. మే 16న రాత్రి 8 గంటలకు బహిర్భూమికి వెళ్లిన బాలిక తిరిగి రాలేదని ఆమె తండ్రి అదే రోజు మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. వీరి ఇంటికి 20 కిలోమీటర్ల దూరంలోని బావిలో శవం కనిపించింది" అని పోలీసులు వెల్లడించారు. బాలికకు తెలిసినవారే ఆమెను చంపి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. అత్యాచారం కూడా జరిగి ఉండొచ్చని అన్నారు. శవాన్ని పోస్టుమార్టంకు పంపించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: