అసోం సీఎం సర్బానంద సోనోవాల్ పర్యటనకు ఒక్కరోజు ముందు కోక్రాజార్ జిల్లాలో మారణాయుధాలు దొరకడం కలకలం రేపింది. సరైబీల్ ఔట్పోస్టులోని రిపు రిజర్వ్డ్ అటవీ ప్రాంతంలో ఈ ఆయధ సామగ్రిని భద్రతా బలగాలు శనివారం స్వాధీనం చేసుకున్నాయి. వాటిలో ఏకే 47 రైఫిళ్లు, గ్రనేడ్లు, బాంబులు, నాటు తుపాకులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. నేలలో దాచి ఉండగా పట్టుకున్నట్లు చెప్పారు.
కోక్రాజార్తో పాటు బోడోలాండ్ టెరిటోరియల్ రీజియన్ (బీటీఆర్) లోని ఇతర నాలుగు జిల్లాల్లో డిసెంబర్ 7, 10న బోడోలాండ్ టెరిటోరియల్ కౌన్సిల్(బీటీసీ) ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కోక్రాజార్ జిల్లా ఫకీరాగ్రామ్లో ఎన్నికల ప్రచారం కోసం సీఎం సర్బానంద.. ఆదివారం పర్యటించనున్నారు. ఈ ఆయుధ సామగ్రి దొరికిన ప్రదేశం ఫకీరాగ్రామ్ నుంచి కేవలం 11కిలోమీటర్ల దూరంలోనే ఉండటం గమనార్హం.