Daughter Memory Bharat Mata Statue : రోడ్డు ప్రమాదంలో మరణించిన తన కుమార్తె జ్ఞాపకార్థం ఆమె విద్యాభ్యాసం చేసిన పాఠశాలలో భరతమాత విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ వ్యక్తి. అయితే పాఠశాలలో చదువుకున్న సమయంలో ఆమె అనేక సార్లు భరతమాత వేషం ధరించింది.
కాంకేర్ జిల్లాలోని కార్ప్ గ్రామానికి చెందిన కౌశల్ పటేల్ కుమార్తె భామినీ పటేల్ స్థానిక హైస్కూల్లో చదువుకుంది. ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం రాయ్‌పుర్ వెళ్లింది. 2021 డిసెంబర్ 23వ తేదీన తన స్వగ్రామానికి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో మరణించింది. భామిని చనిపోయిన నాలుగు నెలల తర్వాత ఆమె అల్మారాలో ఓ డైరీని గుర్తించారు కౌశల్ పటేల్.
"డైరీలో భామిని చాలా విషయాలు రాసింది. అందులో స్కూల్ గురించి రాసుకున్న విషయం చదివా. నాన్నా.. నేను భవిష్యత్తులో ఎక్కడున్నా ప్రతీ ఏడాది ఆగస్టు 15, జనవరి 26వ స్కూల్ల్లో జరిగే వేడుకల్లో కచ్చితంగా పాల్గొంటా. ఎందుకంటే స్కూల్ నాకు రెండో గురువు అని డైరీలో రాసింది"
-- కౌశల్ పటేల్, భరతమాత విగ్రహం ఏర్పాటు చేసిన వ్యక్తి
'చాలా గర్వంగా ఉంది'
తన కుమార్తె పట్ల గర్వంగా ఉందని కౌశల్ పటేల్ తెలిపారు. సమాజం పట్ల మెచ్యూరిటీతో భామిని ఆలోచించడం సంతోషంగా ఉందని తెలిపారు. ఆమె రాసిన డైరీ నోట్ ఆధారంగా ఆమె చదువుకున్న పాఠశాలకు వెళ్లినట్లు తెలిపారు.
"నా కూతురు గుర్తుగా పాఠశాలలో తాగునీటి సదుపాయం కల్పిద్దామనుకున్నా. కానీ భరతమాత విగ్రహం ఏర్పాటు చేస్తే, పాఠశాల ఉన్నన్ని రోజులు నీ కుమార్తెకు గుర్తింపుగా ఉంటుందని ఉపాధ్యాయులు చెప్పారు. గ్రామస్థుల మద్దతుతో నా కుమార్తె జ్ఞాపకార్థం భరతమాత విగ్రహాన్ని ఏర్పాటు చేశాను"
-- కౌశల్ పటేల్, భరతమాత విగ్రహం ఏర్పాటు చేసిన వ్యక్తి
ఆ రెండు రోజులు విగ్రహం వద్దే తండ్రి!
కుమార్తె జ్ఞాపకార్థం పాఠశాలలో భరతమాత విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ప్రస్తుతం ఆ ప్రాంతంలో చర్చనీయాంశమైంది. స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవాల సమయంలో ఆ విగ్రహంలోనే తన కుమార్తెను చూసుకుంటూ గడుపుతున్నారు కౌశల్ పటేల్.