Dalit Student Beaten to Death: రాజస్థాన్ జాలోర్‌లో దారుణం జరిగింది. అగ్రవర్ణాల వారి కోసం ఏర్పాటు చేసిన నీటి కుండను దళిత విద్యార్థి(9) తాకాడని తీవ్రంగా కొట్టాడు ఉపాధ్యాయుడు. దీంతో విద్యార్థి మరణించాడు. నిందితుడు చైల్సింగ్ను(40) పోలీసులు అరెస్టు చేశారు. అతడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు జాలోర్ జిల్లా సురాణా గ్రామంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నాడు. బాలుడు దళిత కులానికి చెందినవాడు. జులై 20న నీటి కుండను తాకాడని ఉపాధ్యాయుడు.. బాలుడి ముఖం, చెవిపై చితకబాదాడు. దీంతో బాధితుడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే ఉదయ్‌పుర్‌లోని ఓ ఆసుపత్రికి తరలించారు విద్యార్థి కుటుంబ సభ్యులు. అక్కడే వారం రోజులపాటు ఉంచారు. అయినా బాధితుడి ఆరోగ్య పరిస్థితిలో ఎటువంటి మార్పు లేదు. అనంతరం మెరుగైన వైద్య చికిత్స కోసం అహ్మదాబాద్‌కు తరలించారు. అక్కడ బాలుడి ఆరోగ్య పరిస్థితి విషమించి శనివారం మరణించాడు. ఈ ఘటనపై రాష్ట్ర విద్యాశాఖ విచారణ ప్రారంభించింది.
బాలుడి అంత్యక్రియలు ఆదివారం జరిగాయి. ఈ అంత్యక్రియల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులపై కొందరు ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. వారిని చెదరగొట్టి పరిస్థితులను అదుపులోకి తెచ్చారు పోలీసులు. ఈ ఘటనపై సీఎం అశోక్ గహ్లోత్ విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారం ప్రకటించారు.
"ఉపాధ్యాయుడి దాడిలో దళిత విద్యార్థి ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. నిందితుడిని పోలీసులు అరెస్టు చేసారు. అతడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అలాగే బాలుని కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందజేస్తాం. మృతుడి కుటుంబానికి వీలైనంత త్వరగా న్యాయం జరిగేలా చూస్తాం.''
-అశోక్ గహ్లోత్, రాజస్థాన్ సీఎం
దళిత విద్యార్థిపై దాడిని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఖండించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఇవీ చదవండి: జాతిని ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి ముర్ము, వారిపై ప్రశంసలు
మహారాష్ట్రలో భాజపాకే కీలక శాఖలు, హోం, ఆర్థిక మంత్రిగా ఫడణవీస్