బురేవి తుపాను బలహీనపడినా తమిళనాడువ్యాప్తంగా వానలు కురుస్తూనే ఉన్నాయి. ఈ వర్షాలకు చిదంబరంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం నటరాజస్వామి ఆలయం నీట మునిగింది. లోపలికి వెళ్లెందుకు వీలు లేకుండా గుడి ప్రాంగణం అంతా వరదనీటితో నిండింది.
కడలూరు, రామనాథపురంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో భారీగా పంట నష్టం జరిగింది. తుపాను బలహీనపడినా ప్రభావం మాత్రం ఇంకా కొనసాగతున్నట్లు భారత వాతావరణ శాఖ తెలింది. రాబోయే 12 గంటలలో మరింత బలహీనపడుతుందని పేర్కొంది. ముందస్తు జాగ్రత్తగా అధికారులు విద్యుత్ సదుపాయాన్ని నిలిపివేశారు.
అధిక వర్షపాతం నమోదు..
తమిళనాడులోని అనేక ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదవుతోంది. రాష్ట్రంలో అత్యధికంగా కొల్లిడమ్లో 36 సెం.మీ వర్షపాతం నమోదు కాగా.. చిదంబరంలో 34 సెం.మీ నమోదైంది. మరెన్నో ప్రాంతాల్లో 10 నుంచి 28 సెం.మీ మేర కురిసినట్లు అధికారులు తెలిపారు.
భారీగా పంట నష్టం..
వరుసగా మూడో రోజు కురిసిన వర్షాలకు కావేరీ పరీవాహక ప్రాంతంలోని తిరువరూర్, తంజావూరు, మాయిలాదుత్తురై, నాగపట్టణం, పుదుకొట్టై, అరియలూర్ జిల్లాల్లో పంట నష్టం భారీగా జరిగింది. అక్కడి ప్రధాన పంటలు అయిన వరి, చెరకు సహా ఇతరత్రా నీట మునిగిపోయాయి.
ఇక్కడ కొంచెం తక్కువే..
రాజధాని చెన్నైలో కూడా 10 సెం.మీ. మేర వర్షపాతం నమోదైనట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. సేలం, శివగంగ, నమక్కల్, తూత్తుక్కుడి, రాణిపేట, కరూర్ జిల్లాల్లో అలాంటి వర్షాలే కురిశాయి.