Cyber Towers Silver Jubilee Celebrations: హైదరాబాద్ గచ్చిబౌలి మైదానంలో ఐటీ ఉద్యోగులు నిర్వహించిన సీబీఎన్ గ్రాటిట్యూట్ కార్యక్రమానికి (CBN Gratitude Concert) విశేష స్పందన లభించింది. నగర నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ఐటీ ఉద్యోగులు, చంద్రబాబు అభిమానులు వేలాదిగా గచ్చిబౌలి మైదానానికి చేరుకొని ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. సైబర్ బాబుకు సంఘీభావంగా గళమెత్తారు.
తమ జీవితాలకు దారి చూపిన దార్శనికుడిని జైలులో బంధించడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం గెలిస్తుందనే నమ్మకం తమకు ఉందన్న ఐటీ ఉద్యోగులు... చంద్రబాబు అంటే పేరు మాత్రమే కాదని, అది ఒక బ్రాండ్ అంటూ నినదించారు. అందుకే ఆయన పట్ల గౌరవాన్ని చాటుకోడానికి సుమారు 1200 మంది ఉద్యోగులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి కార్యక్రమం కోసం ఎంతో కష్టపడ్డారని చెప్పారు.
ఐటీ ఉద్యోగులు తలపెట్టిన ఈ కార్యక్రమానికి నందమూరి కుటుంబసభ్యులతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయి చంద్రబాబుతో ఉన్న వారికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అక్రమంగా కారాగారంలో పెట్టినా... చంద్రబాబు ప్రతిష్ఠ 100 రేట్లు పెరిగిందని, బతుకున్న వ్యక్తులకు.. ఈ స్థాయిలో కృతజ్ఞతలు తెలపడం తానెప్పుడూ చూడలేదని ఎంపీ రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు. ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. చంద్రబాబు త్వరలోనే బయటకి వస్తారని దర్శకుడు బోయపాటి శ్రీను చెప్పారు.
చంద్రబాబు నాయుడు సేవలను ఈ రోజు మనమంతా గుర్తు చేసుకుంటుంటే... ఆయనను అక్రమంగా జైలులో నిర్బంధించడం దారుణమని.. విశ్లేషకుడు నల్లమోతు చక్రవర్తి పేర్కొన్నారు. చంద్రబాబు విజన్ వల్లనే ఈ రోజు భాగ్యనగరం ఈ స్థాయిలో డెవలప్ అయిందని.. సీనియర్ జర్నలిస్ట్ కందుల రమేష్ అన్నారు. జనం కోసం నిరంతరం పాటు పటే వ్యక్తికి, తమకు చేసిన మేలును గుర్తు పెట్టుకుని కార్యక్రమం నిర్వహించిన నిర్వాహకులకు, ఉద్యోగులకు, అభిమానులకు చంద్రబాబు తరఫున తెదేపా అధికార ప్రతినిధి రాజేష్ కృతజ్ఞతలు తెలిపారు.
సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9:30 గంటల వరకు జరిగిన ఈ కృతజ్ఞత సభకు వేలాది మంది అభిమానులు, ఐటీ ఉద్యోగులు కుటుంబసమేతంగా రావడంతో గచ్చిబౌలి స్టేడియం జనసంద్రంగా మారింది. పలువురు ఐటీ ఉద్యోగులు మైదానంలో నేలపై పొర్లు దండాలు పెట్టి కృతజ్ఞత చాటుకున్నారు.
సీబీఎన్ గ్రాటిట్యూట్ కార్యక్రమంలో బెంగళూరు నుంచి వచ్చిన బీట్ గురు బ్యాండ్ బృందం అద్భుతమైన మ్యూజిక్‌తో యువతను ఉర్రూతలూగించింది. అలాగే ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ తన బృందంతో కలిసిన చంద్రబాబుపై ప్రత్యేకంగా ఆలపించిన పాటలు మైదానంలో ఉన్నవారిని ఉత్తేజపరిచాయి.