జూన్ నాటికి కాంగ్రెస్ తన నూతన అధ్యక్షుడిని ఎన్నుకుంటుందని పార్టీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అధ్యక్షతన భేటీ అయిన వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
కాగా, భేటీలో నేతల మధ్య తీవ్ర స్థాయిలో వాదనలు జరిగాయి. కాంగ్రెస్ నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ లేఖ రాసిన గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ.. పార్టీ అధ్యక్ష పదవికి వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
అయితే, అందుకు తొందరేం కాంగ్రెస్ సీనియర్ నేత, రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ పేర్కొన్నారు. ఎవరి పేరునూ ప్రస్తావించకుండానే అసమ్మతివాదుల లక్ష్యంగా విమర్శలు చేశారు. పార్టీకి త్వరగా ఎన్నికలు నిర్వహించాలని కోరుకునే వారు.. దేశంలో అంతకన్నా పెద్ద సమస్యలు ఉన్నాయని గుర్తించాలని హితవు పలికారు. వాటిపై పార్టీ దృష్టిసారించాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీ నాయకత్వంపై వారికేమైనా అనుమానాలు ఉన్నాయా అని ప్రశ్నించారు.
ఆనంద్ స్పందన.. అడ్డుకున్న అంబిక
గహ్లోత్ వ్యాఖ్యలపై ఆనంద్ శర్మ స్పందించారు. సోనియా, రాహుల్‌పై ఎవరికీ అనుమానాలు లేవని పేర్కొన్నారు. పార్టీలోని కొందరు నేతలను లక్ష్యంగా చేసుకోవడం కాంగ్రెస్‌లో ట్రెండ్‌గా మారిపోయిందని ధ్వజమెత్తారు.
ఆనంద్ శర్మ మాట్లాడుతుండగా సీనియర్ నేత అంబికా సోని అడ్డుకున్నారు. గహ్లోత్ ఎవరి పేరును ప్రస్తావించలేదని గుర్తుచేశారు. గహ్లోత్ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నట్లు తెలిపారు.
చివరకు రాహుల్ గాంధీ కల్పించుకోవడం వల్ల ఈ వాదనలకు తెరపడింది. ఇరువర్గాల అభిప్రాయాలను తాను గౌరవిస్తున్నానని పేర్కొన్న రాహుల్.. ఈ విషయాన్ని ఇంతటితో ముగించాలంటే ఎన్నికల తేదీని వెంటనే ప్రకటించాలని అన్నారు.
ఇదిలా ఉండగా.. మే నెల చివర్లో ఏఐసీసీ సమావేశం నిర్వహించాలని సీడబ్ల్యూసీ నిర్ణయించిందని పార్టీ వర్గాలు తెలిపాయి. అధ్యక్ష పదవికి ఎప్పుడు ఎన్నికలు నిర్వహించాలో సోనియా గాంధీ నిర్ణయిస్తారని స్పష్టం చేశాయి.
ఇదీ చదవండి: మే 29న కాంగ్రెస్ నూతన అధ్యక్షుని ఎన్నిక!