CVC Report On Corruption : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో అవినీతికి సంబంధించిన ఫిర్యాదులు అత్యధికంగా హోం మంత్రిత్వ శాఖలోనే వచ్చినట్లు వెల్లడైంది. తర్వాతి స్థానాల్లో భారతీయ రైల్వే, బ్యాంకులు ఉన్నాయని తేలింది. గతేడాదిలో వచ్చిన ఫిర్యాదులకు సంబంధించి కేంద్ర విజిలెన్స్ కమిషన్ నివేదికలో ఈ వివరాలు వెల్లడయ్యాయి.
మూడు నెలలకు పైగా..
గతేడాది కేంద్రంలో అన్ని విభాగాలకు సంబంధించి 1,15,203 ఫిర్యాదులు అందినట్లు సీవీసీ వెల్లడించింది. వాటిలో 85,437 ఫిర్యాదులను పరిష్కరించగా.. మరో 29,766 పెండింగులో ఉన్నట్లు తెలిపింది. ఇందులో 22,034 ఫిర్యాదులు మూడు నెలలకుపైగా పెండింగులో ఉన్నట్లు సీవీసీ పేర్కొంది.
హోంశాఖ ఉద్యోగులపైనే..
CVC Report 2022 : గతేడాది హోంశాఖ ఉద్యోగులు అవినీతికి పాల్పడినట్లు అత్యధికంగా 46,643 ఫిర్యాదులు అందాయని CVC పేర్కొంది. అందులో 23,919 పరిష్కరించగా.. 22,724 ఫిర్యాదులు పెండింగ్లో ఉన్నట్లు తెలిపింది. రైల్వే ఉద్యోగులపై 10,850 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపిన సీవీసీ.. అందులో 9,663 పరిష్కారం అయినట్లు వివరించింది. మరో 917 ఫిర్యాదులు పెండింగ్లో ఉన్నట్లు వెల్లడించింది.
బ్యాంకులపై 8వేలకు పైగా..
CVC Report On Bank Corruption : బ్యాంకులపై 8,129 ఫిర్యాదులు వచ్చినట్లు సీవీసీ తెలిపింది. అందులో 7,762 పరిష్కారం కాగా.. 367 పెండింగ్లో ఉన్నట్లు పేర్కొంది. దేశ రాజధానిలో దిల్లీలో పనిచేసే ఉద్యోగులపై 7,370 , బొగ్గు శాఖలో 4,304, కార్మిక శాఖలో 4,236, పెట్రోలియం శాఖలో 2,617 ఫిర్యాదులు అందాయని సీవీసీ వెల్లడించింది.
శాఖ | మొత్తం ఫిర్యాదులు | పరిష్కరించినవి | పెండింగ్లో ఉన్నవి | 3నెలలకుపైగా పెండింగ్ |
హోంశాఖ | 46,643 | 23,919 | 22,724 | 19,198 |
రైల్వేశాఖ | 10,850 | 9,663 | 917 | 9 |
బ్యాంకులు | 8,129 | 7,762 | 367 | 78 |
దిల్లీ ప్రభుత్వ ఉద్యోగులు | 7,370 | 6,804 | 566 | 18 |
రక్షణశాఖలో 1600కుపైగా ఫిర్యాదులు..
Corruption CVC Report : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్లో 2,150, రక్షణ శాఖలో 1,619 ఫిర్యాదులు వచ్చాయని సీవీసీ వెల్లడించింది. టెలీకమ్యూనికేషన్ శాఖలో 1,308, ఆర్థిక మంత్రిత్వ శాఖలో 1,202, పరోక్ష పన్నుల శాఖలో 1,101 ఫిర్యాదులు అందినట్లు తెలిపింది. బీమా కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగులపై 987, పెన్షన్ల మంత్రిత్వ శాఖలోని ఎంప్లాయిస్పై 970, ఉక్కు మంత్రిత్వ శాఖ ఉద్యోగులపై 923 ఫిర్యాదులున్నాయని సీవీసీ నివేదిక పేర్కొంది.