దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కరోనా నిబంధనల ఉల్లంఘనపై కేంద్రం తీవ్రంగా స్పందించింది. ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో కరోనా నిబంధనలను పాటించడం లేదని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్.. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖలు రాశారు. నిర్లక్ష్యం వహిస్తే మరోసారి కేసులు పెరుగుతాయని హెచ్చరించారు.
"అనేక రాష్ట్రాల్లో ప్రజారవాణా, మార్కెట్లు వంటి బహిరంగ ప్రదేశాల్లో కొవిడ్ నిబంధనల ఉల్లంఘన తీవ్రంగా ఉంది. ఇలా అయితే కరోనా కేసులు విజృంభించే అవకాశం ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు."
-కేంద్ర ఆరోగ్య శాఖ
నిర్ధరణ పరీక్షలు, కాంటాక్ట్ ట్రేసింగ్, మెరుగైన చికిత్స, టీకా పంపిణీ, రద్దీ ప్రదేశాల్లో కఠిన ఆంక్షల అమలు వంటి ఐదు దశల వ్యూహాలను పక్కాగా అమలు చేయాలని కేంద్రం స్పష్టం చేసింది.
'సిద్ధం చేసుకోండి..'
రాష్ట్రాలన్నీ ఎమర్జెన్సీ కొవిడ్ రెస్పాన్స్ ప్యాకేజీ కింద వైద్య మౌలిక సదుపాయాలను సమకూర్చుకోవాలని కేంద్రం సూచించింది. రాబోయే ఉపద్రవాన్ని గుర్తించి ముందస్తు సన్నాహాలు చేసుకోవాలంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇటీవల ప్రకటించిన రూ.23,123 కోట్ల ప్యాకేజీని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది.
ఇవీ చదవండి: