దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఇంకా ముగిసిపోలేదని.. మరికొంత కాలం అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అంతేకాకుండా థర్డ్ వేవ్ కూడా అనివార్యమని.. దానిని సమర్థంగా ఎదుర్కొనేందుకు రాష్ట్రాలు సిద్ధంగా ఉండాలని సూచిస్తోంది. ఈ సమయంలోనే కరోనా వైరస్ సంక్రమణ రేటును సూచించే ఆర్-ఫ్యాక్టర్ ప్రస్తుతం తక్కువగానే ఉన్నట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నారు. ఆగస్టు మొదటి వారంలో ఆర్-ఫ్యాక్టర్ (R value) విలువ 1 కంటే ఎక్కువగా ఉండగా.. ప్రస్తుతం అది క్రమంగా తగ్గుతున్నట్లు పరిశోధకులు అంచనా వేశారు. ముఖ్యంగా మూడో ముప్పు సమీపిస్తోందని వస్తోన్న వార్తల నేపథ్యంలో ఆర్-ఫ్యాక్టర్ క్షీణించడం ఊరట కలిగించే విషయం.
కొవిడ్ ఇన్‌ఫెక్షన్ వ్యాప్తి చెందుతున్న వేగాన్ని ఆర్-ఫ్యాక్టర్ (రీ ప్రొడక్షన్ రేట్) ద్వారా అంచనా వేస్తారు. ఇందులో భాగంగా దేశంలో కరోనా వైరస్ సంక్రమణపై చెన్నైలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్సెస్ (IMS) ఎప్పటికప్పుడు అంచనాలు వేస్తోంది. ఆగస్టు మొదటి వారంలో జరిపిన అధ్యయనంలో ఆర్ విలువ 1 దాటినట్లు ఐఎంఎస్ వెల్లడించింది. ముఖ్యంగా మెట్రో నగరాల్లో ఆర్‌ఫ్యాక్టర్ 1 కంటే ఎక్కువగా నమోదు కావడం ఆందోళకరంగా పేర్కొంది. తాజాగా ఆగస్టు 14-16 తేదీల్లో సమాచారాన్ని విశ్లేషించగా ఈ విలువ 0.9కి క్షీణించిందని ఐఎంఎస్ నిపుణులు సిత్బారా సిన్హా వెల్లడించారు. దీని ద్వారా వైరస్ సోకిన వ్యక్తుల నుంచి ఇతరులకు సంక్రమించే రేటు తక్కువగా ఉన్నట్లు అర్థమవుతోందని తెలిపారు. ఆర్ విలువ తక్కువగా ఉండడం ఉపశమనం కలిగించే విషయమేనని అన్నారు.
ఆ ఐదు రాష్ట్రాల్లో అధికం..
దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత కాస్త అదుపులోనే ఉన్నప్పటికీ కేరళలో మాత్రం విజృంభిస్తోంది. నిత్యం రికార్డు స్థాయిలో 20వేల పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దేశంలో క్రియాశీల కేసులు అక్కడే ఎక్కువగా ఉండగా.. ఆర్ విలువ 1 కంటే ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగించింది. తాజాగా కేరళలో కూడా ఆర్ ఫ్యాక్టర్ 1 కంటే తక్కువగానే నమోదైనట్లు ఐఎంఎస్ పరిశోధకులు వెల్లడించారు. వైరస్ దాటికి వణికిపోయిన మహారాష్ట్రలోనూ ఆర్ విలువ 0.89గా నమోదైంది. అటు ఈశాన్య రాష్ట్రాల్లోనూ ఆర్ విలువ క్షీణిస్తుండగా.. హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు, ఉత్తరాఖండ్‌లో ఆర్ ఫ్యాక్టర్ 1కి చేరువలో ఉంది. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల్లోనే ఆర్ ఫ్యాక్టర్ 1 కంటే ఎక్కువగా ఉంది. ఇక ప్రధాన నగరాల్లో చూస్తే.. ముంబయి (0.70), దిల్లీ (0.85), బెంగళూరు (0.94), చెన్నై (0.97)లో 1కి దగ్గరగా ఉండగా.. కోల్‌కతా (1.08), పుణె (1.05) నగరాల్లో ఆర్ విలువ 1కంటే అధికంగా ఉంది.
దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉద్ధృతికి చాలా రాష్ట్రాలు వణికిపోయిన విషయం తెలిసిందే. ఆ సమయంలో వైరస్ సంక్రమణ రేటును సూచించే ఆర్-ఫ్యాక్టర్ అధికంగా ఉండడం ఆందోళన కలిగించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వైరస్ ఉద్ధృతి కాస్త తగ్గినప్పటికీ ఐదు రాష్ట్రాల్లో ఆర్ ఫ్యాక్టర్ 1 కన్నా అధికంగా ఉండడం ఆందోళన కలిగించే విషయమని నిపుణులు సూచిస్తున్నారు. అటు కేరళ, తమిళనాడులోని పలు జిల్లాల్లో వైరస్ సంక్రమణ రేటు అధికంగానే ఉందని హెచ్చరిస్తున్నారు.
ఇదీ చూడండి: Corona Cases: దేశంలో కొత్తగా 35వేల కేసులు, 37వేల రికవరీలు