Covid Cases in India: గత కొద్ది రోజులుగా ఆందోళనకర స్థాయిలో కేసులు నమోదవుతున్న మహారాష్ట్రలో కేసులు స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 43,211 కేసులు బయటపడ్డాయి. కర్ణాటకలో భారీగా కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా 28,723 కేసులు వెలుగుచూశాయి. 14 మంది ప్రాణాలు కోల్పోయారు. యాక్టివ్ కేసుల సంఖ్య 1,41,337కు చేరింది.
ప్రాంతం | కొత్త కేసులు | మరణాలు |
మహారాష్ట్ర | 43,211 | 19 |
కర్ణాటక | 28,723 | 14 |
దిల్లీ | 24,383 | 34 |
తమిళనాడు | 23,459 | 26 |
బంగాల్ | 22,645 | 28 |
ఉత్తర్ప్రదేశ్ | 16,016 | 3 |
కేరళ | 16,338 | 20 |
ముంబయి | 11,317 | 9 |
రాజస్థాన్ | 10,307 | 3 |
బిహార్ | 6,500 | 2 |
ఆంధ్రప్రదేశ్ | 4,528 | 1 |
మధ్యప్రదేశ్ | 4,755 | - |
తెలంగాణ | 2,398 | 3 |
చండీగఢ్ | 1,834 | - |
ఆన్లైన్ పాఠాలు
కేరళలో కరోనా కేసులు మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో తరగతులు ఆన్లైన్లోనే నిర్వహించాలని నిర్ణయించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఈనెల 21న ఆన్లైన్ బోధనను తిరిగి అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించింది. రెండు వారాల పాటు ఆన్లైన్ బోధన కొనసాగించి ఆ తర్వాత కొనసాగింపుపై ఫిబ్రవరి రెండో వారంలో తుది నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. ఈ గడువులోగా పాఠశాలలో భారీగా కొవిడ్ కేసులు నమోదైతే సంబంధిత స్కూళ్లు రెండు వారాల పాటు సెలవు ప్రకటించవచ్చని స్పష్టం చేసింది.
ఒమిక్రాన్ కేసులు
భారత్లో రోజువారీ కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగింది. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు 2,64,202 కేసులు నమోదయ్యాయి. వైరస్ ధాటికి మరో 315 మంది మరణించారు. 1,09,345 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 14.78 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
దేశంలో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. 28 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 5,753కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
భారత్లో టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. గురువారం ఒక్కరోజే 73,08,669 డోసులు అందించారు. ఫలితంగా ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,55,39,81,819కు చేరింది.
ఇదీ చూడండి : కరోనా విలయం- ప్రపంచవ్యాప్తంగా 32 కోట్లు దాటిన కేసులు