కొవిడ్-19తో(Covid-19 in India) ఆస్పత్రి బారినపడే ముప్పుతో పాటు తీవ్ర అనారోగ్యం గురికాకుండా వ్యాక్సిన్‌లు(Covid Vaccine) సమర్థవంతంగా కాపాడుతున్నాయని తాజా అధ్యయనం మరోసారి స్పష్టం చేసింది. టీకా తీసుకోని వారితో పోలిస్తే కొవిడ్ టీకా ఒకటి లేదా రెండు డోసులు తీసుకున్న వారు కొవిడ్-19(Covid-19 Vaccine) బారిన పడినా.. తీవ్ర అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం తక్కువేనని వెల్లడించింది. ఇక రెండు డోసులు తీసుకున్న వారిని 28రోజుల కంటే ఎక్కువగా (Long Covid) కొవిడ్ వేధించినా.. ఆ సమస్యల ప్రభావం టీకా తీసుకోని వారితో పోలిస్తే సగం కంటే తక్కువగానే ఉంటోందని పేర్కొంది. ఇక బ్రేక్‌థ్రూ ఇన్‌ఫెక్షన్‌ల(Breakthrough Infection) బారినపడే వారిలో ఎక్కువగా రోగనిరోధకత శక్తి తక్కువగా ఉండే 60ఏళ్లకుపైగా వృద్ధులు, గుండె, కిడ్నీ, ఊపిరితిత్తుల సమస్యలున్నవారే ఉంటున్నారని తాజా లాన్సెట్ అధ్యయనం అంచనా వేసింది.
కొవిడ్ వ్యాక్సిన్(Corona Vaccine) తీసుకున్న తర్వాత ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యే అవకాశాలు, అనంతర సమస్యలను అంచనా వేసేందుకు లండన్ పరిశోధకులు అధ్యయనం చేపట్టారు. ఇందుకోసం బ్రిటన్ ప్రభుత్వం రూపొందించిన ZOE యాప్ సహకారంతో డిసెంబర్ 8, 2020 నుంచి జులై 4, 2021 మధ్య కాలాన్ని పరిగణలోకి తీసుకున్నారు. ఇందులో భాగంగా ఫైజర్, ఆక్స్‌ఫర్డ్, మోడెర్నా తీసుకున్న మొత్తం 12లక్షల మంది సమాచారాన్ని విశ్లేషించారు. వీరిలో కేవలం 0.5శాతం మందిలోనే తొలిడోసు తీసుకున్న 14 రోజుల తర్వాత బ్రేక్‌థ్రూ ఇన్‌ఫెక్షన్‌ను గుర్తించారు. ఇక రెండు డోసులు తీసుకున్న వారిలో కేవలం 0.2శాతం మందిలోనే ఇన్‌ఫెక్షన్‌ను కనుగొన్నారు. మొత్తంగా ఒకటి లేదా రెండు డోసులు తీసుకున్న వారు వైరస్ బారినపడినా.. ఆస్పత్రి చేరిక ప్రమాదాన్ని 70శాతం తగ్గిస్తున్నట్లు పరిశోధకులు పేర్కొన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా డెల్టా వేరియంట్(Delta Variant Covid) ప్రభావంతో కొవిడ్ కేసుల సంఖ్య పెరుగుదల కనిపించడం ఆందోళనకర విషయమే. అయితే, వ్యాక్సిన్ తీసుకున్న వారిలో బ్రేక్‌థ్రూ ఇన్‌ఫెక్షన్‌లు ముందుగా అంచనా వేసినవే. అయినప్పటికీ తీవ్ర అనారోగ్యానికి గురికాకుండా, ప్రాణాలను రక్షించే లక్ష్యంతో రూపొందించిన వ్యాక్సిన్‌లు.. అదే పనిని సమర్థంగా చేస్తున్నాయనే వాస్తవాన్ని మరవద్దు’ అని బ్రిటన్‌లోని కింగ్స్ కాలేజీ లండన్‌కు చెందిన క్లెయిరీ స్టీవ్స్ పేర్కొన్నారు. ఆస్పత్రుల్లో చేరుతున్న కొవిడ్ కేసుల్లో 27శాతం రోగులు ప్రాణాలు కోల్పోతున్నారని మరో అధ్యయనం వెల్లడించిందని.. అయినప్పటికీ టీకా తొలిడోసు తీసుకోవడం ద్వారా ఇలాంటి సంఖ్యను భారీగా తగ్గించవచ్చని అభిప్రాయపడ్డారు. కొవిడ్ ఇన్‌ఫెక్షన్‌ను నిరోధించడంలో వ్యాక్సిన్‌లు కీలక పాత్ర పోషిస్తున్నాయనే విషయం తాజా అధ్యయనం మరోసారి నిరూపిస్తోందని బ్రిటన్ శాస్త్రవేత్తలు మరోసారి నొక్కి చెబుతున్నారు.
ఇదీ చూడండి: Vaccination: 'దేశంలో 50శాతానికిపైగా వయోజనులకు కొవిడ్ టీకా'