భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్‌లో ముఖ్యమంత్రిగా 'శివుడు', ఆ రాష్ట్ర భాజపా అధ్యక్షుడిగా 'విష్ణువు' ఉన్నప్పుడు.. రాష్ట్రానికి కరోనా వైరస్ఎలాంటి హానీ చేయలేదని ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, మధ్యప్రదేశ్ భాజపా అధ్యక్షుడు విష్ణు దత్‌ను దేవుళ్లతో పోలుస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
"మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా శివుడు, మధ్యప్రదేశ్ రాష్ట్ర భాజపా అధ్యక్షుడుగా విష్ణు ఉన్నప్పుడు... ఆ రాష్ట్రంలో కరోనా వైరస్ ఎలా ప్రభావం చూపగలదు? డిసెంబర్ నాటికి దేశంలోని అన్ని ఆరోగ్య కేంద్రాలకు 135 కోట్ల టీకా డోసులు అందుతాయి."
-తరుణ్ చుగ్, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి
'అప్పుడు నిద్రపోయారా?'
తరుణ్ చుగ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఘాటుగా స్పందించింది. పార్టీ కార్యకర్తల నుంచి ప్రశంసలు పొందేందుకు నేతలు ఇలాంటి వ్యాఖ్యలే చేస్తారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి భూపేంద్ర గుప్తా విమర్శించారు.
"మధ్యప్రదేశ్‌లో జనవరి-మే మధ్య 3.28 లక్షల మంది కరోనా కారణంగా కన్నుమూశారు. దేశవ్యాప్త మరణాల రేటు కంటే ఇది 24శాతం అధికం. కొవిడ్ ధాటికి 3,500 మంది భాజపా కార్యకర్తలు చనిపోయారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడే స్వయంగా చెప్పారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో శివరాజ్, విష్ణుదత్ ఎక్కడున్నారో చెప్పాలి. ఆ సమయంలో వారు నిద్రపోయారా? భవిష్యత్తులో కరోనాను వారు ఎలా కట్టడి చేస్తారు?"
- భూపేంద్ర గుప్తా, కాంగ్రెస్ అధికార ప్రతినిధి.
అయితే.. తరుణ్ చుగ్ కేవలం ముఖ్యమంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి మొదటి పేర్లను మాత్రమే ఉపయోగించారని మధ్యప్రదేశ్ భాజపా కార్యదర్శి రజ్నీశ్ అగర్వాల్ వివరించారు. మహమ్మారి విజృంభణ సమయంలో భాజపా ప్రభుత్వం సహా తమ పార్టీ.. ప్రజలకు సేవ చేయటంలో నిమగ్నమైందని చెప్పారు.
ఇదీ చూడండి: 'అభిషేక్ బెనర్జీపై దాడిలో అమిత్ షా హస్తం'
ఇదీ చూడండి: పెట్టుబడి సాయం విడుదల- రైతుల ఖాతాల్లోకి రూ.19,500 కోట్లు