కరోనా నిరోధక టీకా కొవాగ్జిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను భారత్ బయోటెక్ ప్రకటించింది. కరోనాను నివారించడంలో కొవాగ్జిన్ మధ్యంతర క్లినికల్ సామర్థ్యం 81 శాతమని ఆ సంస్థ వెల్లడించింది. యూకే రకం కరోనా వైరస్‌పై కూడా కొవాగ్జిన్ సమర్థంగా పనిచేస్తున్నట్లు భారత్ బయోటెక్ తెలిపింది.
మరింత సమాచారంతో పాటు తుది విశ్లేషణ చేయడానికి కావాల్సిన 130 కేసులు నిర్ధరణ అయ్యే వరకు టీకాపై క్లినికల్ ట్రయల్స్ కొనసాగుతాయని భారత్ బయోటెక్ స్పష్టం చేసింది. మొదటి, రెండు, మూడు దశ క్లినికల్ ట్రయల్స్ 27 వేల మంది వలంటీర్లపై పరీక్షలు నిర్వహించామని.. మూడో దశలోనే 25,800 మంది వలంటీర్లపై పరీక్షలు నిర్వహించామని భారత్ బయోటెక్ పేర్కొంది. గతంతో పోలిస్తే మూడో దశలో మెరుగైన ఫలితాలు వచ్చినట్లు సంస్థ తెలిపింది. ఇది దేశంలోనే ఇప్పటివరకు నిర్వహించిన అతిపెద్ద క్లినికల్ ట్రయల్స్ అని పేర్కొంది. తద్వారా టీకా సామర్థ్యాన్ని స్పష్టంగా చెప్పవచ్చని వెల్లడించింది.
"కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ఈ రోజు కీలకమైనది. కరోనాపై కొవాగ్జిన్ అధిక సామర్థ్యంతో పనిచేస్తుంది. మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి. వేగంగా వృద్ధి చెందుతున్న కరోనా ఉత్పరివర్తనాలకు వ్యతిరేకంగా కొవాగ్జిన్ గణనీయమైన రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. యూకే రకం కరోనా వైరస్‌పై కూడా కొవాగ్జిన్ సమర్థంగా పని చేస్తుంది."
-డాక్టర్ కృష్ణ ఎల్లా, భారత్ బయోటెక్ ఎండీ.
ప్రస్తుతం ఆక్స్‌ఫర్డ్‌కు చెందిన కొవిషీల్డ్‌తో పాటు కొవాగ్జిన్‌ను భారత్‌లో పంపిణీ చేస్తున్నారు. కొవిషీల్డ్ సామర్థ్యం 70 శాతంకాగా భారత్ బయోటెక్ టీకా సామర్థ్యం 81 శాతం కావడం గమనార్హం.
ఇదీ చదవండి:'టీకా ధ్రువపత్రంపై మోదీ చిత్రం అధికార దుర్వినియోగమే'