'ప్రి వెడ్డింగ్ ఫొటో షూట్'కు వెళ్లిన ఓ జంట తిరిగిరానిలోకాలకు వెళ్లిపోయింది. కెమెరాను చూసి స్మైల్ ఇస్తూ ఆ జంట నదిలో పడిపోయింది. ఈ ఘటన తిరుమకుడాలు నరసిపుర తాలుకులోని తలఖాదు గ్రామంలో జరిగింది.
పెళ్లింట్లో విషాదం..
తలఖాదు గ్రామానికి చెందిన చందు, శశికళకు ఇటీవలే నిశ్చితార్థం అయింది. ఈ నెల 22న పెళ్లి ముహూర్తం కూడా పెట్టారు వారి తల్లితండ్రులు. పెళ్లికి కొన్ని రోజుల ముందు జరిగే 'ప్రి వెడ్డింగ్ ఫోటో షూట్' కోసం ఆ జంట సొంత గ్రామంలోని కావేరి నదికి పడవలో వెళ్లింది. ఈ క్రమంలో శశికళ కాలు జారి నదిలో పడింది. ఆమెను కాపాడే క్రమంలో చందు కూడా నదిలో పడిపోయాడు. ఇద్దరికీ ఈత రాకపోవడం కారణంగా ఆ జంట నదిలోనే తుది శ్వాస విడిచింది.
విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను బయటకు తీశారు. తలఖాదు పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి:'అమెరికాలో ట్రంప్‌కు పట్టిన గతే భాజపాకు పడుతుంది'