కరోనా మహమ్మారి మూడో దశకు దేశం సిద్ధపడి ఉండాలని, సరిపడా ఆక్సిజన్ నిల్వలు ఉండేలా ప్రభుత్వాలు జాగ్రత్తలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. థర్డ్ వేవ్‌లో కరోనా వైరస్‌తో పోరాడటానికి పాన్ ఇండియా స్థాయిలో ఆక్సిజన్ అందించాలని.. ఆక్సిజన్ వినియోగం, నిల్వలపై ఆడిట్ జరపాలని కేంద్రానికి సూచించింది. రోజుకు 700 మెట్రిక్ టన్నుల చొప్పున ప్రస్తుతం దిల్లీకి చేస్తున్న సరఫరాను తమ తదుపరి ఆదేశాలు జారీ చేసేవరకు తగ్గించవద్దని కేంద్రాన్ని ఆదేశించింది. పరస్పర ఆరోపణలకు అత్యున్నత న్యాయస్థానం వేదిక కాకూడదని స్పష్టం చేసింది. దిల్లీలో ఆక్సిజన్ పంపిణీపై గురువారం జరిగిన విచారణలో ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
ప్రజలు తమను అధికారం చేపట్టమని రెండు సార్లు అవకాశం ఇచ్చారని, కొవిడ్ కారణంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులను అర్థం చేసుకోగలమని కేంద్రం.. సుప్రీంకు సమాధానం ఇచ్చింది. సరిపడా ఆక్సిజన్ అందుబాటులో ఉండేలా అత్యున్నత స్థాయిలో కృషి చేస్తున్నామని పేర్కొంది. ఆక్సిజన్ పంపిణీపై కేంద్రం పక్షపాతంగా వ్యవహరిస్తోందన్న దిల్లీ ప్రభుత్వం ఆరోపణలను ఖండించింది.
కర్ణాటక హైకోర్టు తీర్పుపై కేంద్రం..
కర్ణాటకలో రోజూవారీ ఆక్సిజన్ సరఫరా 965 మెట్రిక్ టన్నుల నుంచి 1200 మెట్రిక్ టన్నులు చేయాలన్న ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశాలపై కేంద్రం.. సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ ఆదేశాలపై స్టే విధించాలని విజ్ఞప్తి చేసింది. కేసును పరిశీలించి తదుపరి ఆదేశాలను జారీ చేస్తామని కోర్టు వెల్లడించింది.
కేంద్రం సుప్రీంను ఆశ్రయించడంపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేసింది. కర్ణాటక హైకోర్టు ఆదేశాలపై కేంద్రం స్పందించిన తీరు తమను షాక్‌కు గురి చేసిందని పేర్కొంది.
ఇదీ చదవండి : వైద్యం వికటించి ఎనిమిది మంది మృతి