counterfeit Indian coins: నకిలీ నాణేలు తయారుచేసి.. చలామణి చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు దిల్లీ పోలీసులు. ఐదుగురిని ఆదివారం అరెస్టు చేశారు. ముఠాలోని నరేష్ కుమార్, సంతోష్ మండల్‌ను ప్రధాన నిందితులుగా గుర్తించారు. వీరి దగ్గర ధర్మేంద్ర కుమార్ శర్మ, ధర్మేంద్ర మహతో, శ్రావణ్ కుమార్ శర్మలు పని చేస్తున్నట్లుగా గుర్తించారు.
10,112 నకిలీ రూ.10 నాణేలను నిందితుల దగ్గర నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటితో పాటు ఒక్కో దాంట్లో 4వేల ఇతర నాణేలు కలిగిన 20 ప్యాకెట్లను సీజ్ చేశారు. నాలుగు మెషీన్లు, ఎలక్ట్రిక్ మోటార్, నాణేల తయారికి ఉపయోగించే ముడిసరుకును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నాణెం లోపల భాగం తయారికి ఉపయోగించే 212 కేజీల రాగి మెటీరియల్, నాణెం బయటి భాగం తయారికి వాడే 315 కిలోల ఇత్తడిని జప్తు చేశామని తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
"సుమారు 10-12 లక్షల రూపాయల విలువైన నకిలీ నాణేలను నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నాం. గత నెలన్నర నుంచి నకిలీ నాణేల ఫ్యాక్టరీ నడుస్తోంది. హరియాణా, చార్కి దాద్రి జిల్లాలోని ఇమ్లాటా గ్రామంలో పట్టుకున్నాం. ఈ నకిలీ నాణేల తయారీ కోసం 1000 చదరపు అడుగుల విస్తీర్ణంలో శబ్ద రహిత గదిని నిందితులు నిర్మించారు. రోజుకు సుమారు 1500-2000 నాణేలను ఒక్కొక్కరూ తయారుచేస్తారు. నాణేల మీద ఉండే అశోక చక్రం, భారత్ దేశం గుర్తులను హైడ్రాలిక్ ప్రెజర్ యంత్రంతో రూపొందిస్తున్నారు. ఈ నాణెలను నిందితులు మార్కెట్లో సులువుగా చలామణి చేస్తున్నారు. ఈ నకిలీ నాణేలు అచ్చం సాధారణ నాణేలులానే ఉంటాయి."
-దిల్లీ పోలీసులు
ఇదీ చదవండి: చాక్లెట్ అనుకొని ఎలుకల మందు తిని.. పాపం చిన్నారి!