కరోనా భయంతో కర్ణాటకలో ఆత్మహత్య చేసుకున్న దంపతుల వ్యవహారం అనూహ్య మలుపు తిరిగింది. మరణానంతరం వారికి జరిపిన పరీక్షల్లో ఇద్దరికీ కరోనా నెగిటివ్గా తేలింది.
ఇదీ జరిగింది..
కొవిడ్ సోకిందని మంగళూరు చిత్రపూర్కు చెందిన రమేశ్ కుమార్, గుణ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. "మేమిద్దరం కరోనా బారిన పడ్డాం. నా భార్య, నేను సూసైడ్ చేసుకుంటున్నాం. మా అంత్యక్రియలు జరిపించండి." అని పోలీస్ అధికారికి వివరించి ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు రమేశ్. తమ తల్లిదండ్రులను క్షేమంగా చూసుకోవాలని, తమ అంత్యక్రియలకు రూ.లక్షను ఉంచుతున్నామని.. తన స్నేహితులకు వాయిస్ మెసేజ్ కూడా పంపిచాడు.
అంతకుముందు గుణ రాసిన సూసైడ్ నోట్లో 'నాకు కరోనాతో పాటు బ్లాక్ ఫంగస్ లక్షణాలు ఉన్నాయి. నా భర్తకు కరోనా ఉంది. అందుకే మేము చనిపోదామని నిర్ణయించుకున్నాం. మా ఇంటి సామాన్లు, ఇతర వస్తువులను పేదలకు పంచండి' అని ఉంది.
విషయం తెలిసన వెంటనే.. ఆ దంపతులను కాపాడేందుకు పోలీసులకు, సామాజిక మాధ్యమాల ద్వారా స్థానికులకు సమాచారం అందించారు కమిషనర్. కానీ అప్పటికే వారు మరణించారు. అయితే మరణానంతరం వారికి కరోనా పరీక్షలు జరపగా ఇద్దరికీ నెగిటివ్గా తేలిందని పోలీసులు తెలిపారు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయంతో అందమైన జీవితాన్ని కోల్పోయారు ఆ దంపతులు.
ఇదీ చదవండి: 50 రూపాయల గొడవ- ఏడాదిన్నర చిన్నారి బలి