కరోనా టీకా రెండు డోసులు తీసుకున్నవారికి ప్రయాణ ఆంక్షల నుంచి విముక్తి కల్పించేలా.. బొంబాయి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. టీకా రెండు డోసులు తీసుకున్న వారిని గుర్తించి, వారికి 'కామన్ కార్డు' అందించడంపై నిర్ణయం తీసుకోవాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్రాన్ని ఆదేశించింది. పూర్తి టీకా డోసులు తీసుకున్నవారికి.. స్థానిక రైళ్లలో ప్రయాణించేలా అనుమతించాలని మహారాష్ట్ర ప్రభుత్వానికి న్యాయస్థానం సూచించింది. ఈ మేరకు జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ జీఎస్ కులకర్ణి ధర్మాసనం పేర్కొంది.
లోకల్ రైళ్లలో తాము ప్రయాణించేందుకు అనుమతించాలని కోరుతూ.. జర్నలిస్టులు, న్యాయవాదులు, జ్యుడిషియల్ క్లర్కులు దాఖలు చేసిన పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై న్యాయస్థానం విచారణ చేపట్టింది. అయితే.. రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ మంజూరు చేసి లేఖ ఆధారంగా రైల్వే శాఖ.. రైళ్లలో ప్రయాణించేందుకు అనుమతినిస్తోందని మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరైన అడ్వొకేట్ జనరల్ అశుతోష్ కుంభాకోనీ.. న్యాయస్థానానికి తెలిపారు.
ఆ దేశాల్లో ఉన్నట్లుగా..
వాదనలు విన్న ధర్మాసనం.. కరోనా టీకా తీసుకున్నవారిని, తీసుకోని వారిని వేరు చేయాలని తెలిపింది. అందుకోసం టీకా తీసుకున్న వారికి ఓ కార్డును అందజేయాలని పేర్కొంది. కొన్ని పాశ్చాత్య దేశాల్లోనూ ప్రయాణ విషయాల్లో అలాంటి కార్డులను వినియోగిస్తున్నారని ప్రస్తావించింది. కామన్ కార్డు ఉంటే విదేశీ ప్రయాణాల అంశం కూడా సులభతరంగా మారుతుందని పేర్కొంది. ముంబయివాసుల అవసరాలు తీర్చేలా ఒక నిపుణుల కమిటీ ఏర్పాటు చేసి ప్రయాణ ఆంక్షలపై నిర్ణయం తీసుకోవాలని సూచించింది.
కామన్ కార్డు అంశంపై తాము చర్చిస్తామని కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన అనిల్ సింగ్ తెలిపారు. దీనిపై ఆగస్టు 12లోపు ప్రమాణ పత్రం దాఖలు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 16కు వాయిదా వేసింది.
ఇదీ చూడండి: 'దేశాభివృద్ధిని అడ్డుకోవటమే విపక్షాల లక్ష్యం'
ఇదీ చూడండి: చైనా యాప్ ద్వారా రూ.50 కోట్ల భారీ స్కామ్