Yashwant Sinha: రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి, టీఎంసీ మాజీ నేత యశ్వంత్ సిన్హా పేరు ఖరారైంది. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నేతృత్వంలో జరిగిన విపక్షాల సమావేశంలో ఈమేరకు ఏకాభిప్రాయం కుదిరింది. అనంతరం కాంగ్రెస్ నేత జైరాం రమేశ్.. యశ్వంత్ సిన్హానే తమ ఉమ్మడి అభ్యర్థి అని అధికారికంగా ప్రకటించారు. ఈనెల 27న ఉదయం 11.30కి నామినేషన్ వేయనున్నట్లు పవార్ వెల్లడించారు.
యశ్వంత్ సిన్హా కూడా విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసేందుకు సముఖంగానే ఉన్నారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. టీఎంసీకి కూడా రాజీనామా చేస్తున్నట్లు ఈ ఉదయమే ప్రకటించారు. దేశ ప్రయోజనాల కోసం పార్టీకి దూరంగా పనిచేయాల్సిన సమయం వచ్చిందంటూ సిన్హా ట్వీట్ చేశారు. టీఎంసీలో మమతా బెనర్జీ తనకు ఇచ్చిన గౌరవం, హోదాకు ఆమెకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతిపక్షాల ఐక్యత కోసం పని చేయాల్సిన సమయం వచ్చిందన్నారు.
ఐఏఎస్ నుంచి రాజకీయాల వైపు...
యశ్వంత్ సిన్హా బిహార్ పట్నాలో 1937 నవంబర్ 6న జన్మించారు. 1958లో యూనివర్సిటీ ఆఫ్ పట్నాలో పొలిటికల్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. అక్కడే 1962 వరకు ప్రొఫెసర్‌గా పనిచేశారు. 1960లోనే సిన్హా ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. 24 ఏళ్ల పాటు సేవలందించారు. పలు కీలక పదవులు చేపట్టారు. అనంతరం 1984లో జనత పార్టీ ద్వారా రాజకీయ ప్రవేశం చేశారు. 1986లో పార్టీ ఆల్ ఇండియా జనరల్ సెక్రెటరీగా నియమితులయ్యారు. 1988లోనే రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1989లో జనతాదళ్ ఏర్పాటయ్యాక ఆ పార్టీకి జనరల్ సెక్రెటరీగా నియమితులయ్యారు. అప్పటి ప్రధాని చంద్రశేఖర్ కేబినెట్లో 1990 నవంబర్ 1 నుంచి 1991 జూన్ వరకు ఆర్థిక మంత్రిగా పనిచేశారు.
భాజపా ఏర్పాటయ్యాక 1996లో పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా యశ్వంత్ సిన్హా నియమితులయ్యారు. 1998, 1999, 2009లో హజారీబాగ్ లోక్ సభ నియోజకవర్గం నుంచి భాజపా తరఫున పోటీ చేసి గెలుపొందారు. 1998-2022 మధ్య కాలలో అటల్‌బిహారీ వాజ్‌పేయీ హయాంలో ఆర్థిక మంత్రిగా సేవలందించారు. 2002-2004 మధ్య విదేశీ వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.
అభ్యర్థిగా సిన్హానే ఎందుకు?
భాజపాలో ఉంటూనే సొంతపార్టీపై గళమెత్తిన అతికొద్ది మంది నేతల్లో యశ్వంత్ సిన్హా ఒకరు. పలుమార్లు ప్రధాని నరేంద్ర మోదీపై బహిరంగంగా విమర్శలు గుప్పించారు. అయితే 2018లో పార్టీ ఉపాధ్యక్ష పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి బయటకు వచ్చారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని మోదీ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు.
ఆ తర్వాత బంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు 2021 మార్చి 13న మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీలో చేరారు యశ్వంత్ సిన్హా. మార్చి 15న పార్టీ ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఇప్పుడు రాష్ట్రపతి రేసులో ఉంటున్నందున పార్టీకి రాజీనామా చేసి బయటకు వస్తున్నట్లు చెప్పారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న యశ్వంత్ సిన్హాకు అన్ని పార్టీలతోనూ సత్సంబంధాలు ఉన్నాయి. దాదాపు రెండున్నర దశాబ్దాల పాటు ఐఏఎస్ అధికారిగా సేవలందించిన అనుభవం ఉంది. అందుకే ఆయనే రాష్ట్రపతి అభ్యర్థికి సరైన వ్యక్తి అని భావించి విపక్షాలు ఏకాభిప్రాయంతో ఆయన పేరును ఖరారు చేశాయి.
సుదీర్ఘ కసరత్తు: రాష్ట్రపతి పదవికి భాజపాయేతర పక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఉండేందుకు ఇప్పటికే ముగ్గురు నేతలు తిరస్కరించగా ప్రతిపక్షాలకు కొంత ఇబ్బందికర పరిస్థితి తలెత్తింది. రాష్ట్రపతి రేసుకు తొలుత ఎన్సీపీ అధినేత శరద్ పవార్ విముఖత చూపించగా.. ఆ తర్వాత జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా, మహాత్మా గాంధీ మనవడు, పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీ కూడా విపక్షాల ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించారు. దీంతో యశ్వంత్ సిన్హా పేరు తెరపైకి వచ్చింది. అయితే సిన్హాను రాష్ట్రపతి ఎన్నికల్లో దింపాలంటే ఆయన టీఎంసీకి రాజీనామా చేయాలని కాంగ్రెస్, వామపక్షాలు ఒత్తిడి చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆయన టీఎంసీకి రాజీనామా చేయగా.. విపక్ష నేతలంతా సిన్హాను రాష్ట్రపతి అభ్యర్థిగా ఒప్పుకున్నారు.