Conman Sukesh Chandrasekhar : మనీ లాండరింగ్ కేసులో తిహాడ్ జైల్లో ఉన్న ఆర్థిక నేరగాడు సుకేశ్ చంద్రశేఖర్.. ఒడిశా రైలు దుర్ఘటనలో చనిపోయిన కుటుంబాలకు, గాయపడిన వారికి రూ.10 కోట్ల విరాళాన్ని ప్రకటించాడు. ఈ మేరకు తన న్యాయవాది ద్వారా రైల్వే మంత్రిత్వశాఖకు లేఖ పంపించాడు. ఆ విరాళాన్ని అంగీకరించాలని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కోరాడు.
ఆ మొత్తం తన చట్టబద్ధమైన ఆదాయవనరు నుంచి ఇచ్చానని.. వాటిపై ఆదాయపు పన్ను కూడా కట్టానని సుకేశ్ లేఖలో పేర్కొన్నాడు. విరాళాన్ని పంపేందుకు సంబంధిత విభాగ వివరాలను పంపాలని కోరాడు. తక్షణమే డిమాండ్ డ్రాఫ్ట్‌ను తయారుచేసి రూ.10కోట్ల విరాళాన్ని పంపిస్తానని తెలిపాడు. ఆ డబ్బుకు సంబంధించిన పత్రాలు, ఐటీ రిటర్నుల వివరాలను కూడా డీడీతో పాటు అందజేస్తానని చెప్పాడు. దీంతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ, హోమంత్రి అమిత్ షా, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, రైల్వే అధికారులను తన లేఖలో సుకేశ్ ప్రశంసించాడు.
"ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం వల్ల నేను చాలా బాధపడ్డాను. ఈ దుర్ఘటనకు సంబంధించిన బాధితులను ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందని తెలుసు. కానీ ఓ బాధ్యతాయుతమైన పౌరుడిగా.. బాధిత కుటుంబాలకు నా వంతు సహాయంగా రూ. 10 కోట్లు విరాళం అందిస్తున్నాను. ఒడిశా రైలు దుర్ఘటనలో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల చదువులు, పెద్దదిక్కును పోగొట్టుకున్న కుటుంబాలను ఆదుకోవడానికి ఈ మొత్తం ఉపయోగపడుతుంది. నేను నిర్వహించే శారదా ఫౌండేషన్, చంద్రశేఖర్ క్యాన్సర్ ఫౌండేషన్, ఎల్‌ఎస్ ఎడ్యుకేషన్.. సంస్థలు దక్షిణ రాష్ట్రాల్లో ఆపన్నులకు అండగా ఉంటున్నాయి" అని సుకేశ్ చంద్రశేఖర్ తన లేఖలో పేర్కొన్నాడు.
జూన్ 2న ఒడిశాలో మూడు రైళ్లు ప్రమాదానికి గురి కాగా.. మరణించిన వారి సంఖ్య తాజాగా 290కి పెరిగింది. చికిత్స పొందుతున్న 17 ఏళ్ల బాలుడు శుక్రవారం ప్రాణాలు కోల్పోయాడని అధికారులు వెల్లడించారు. దీంతో మృతుల సంఖ్య 289 నుంచి 290కి చేరుకుందని చెప్పారు. శుక్రవారం మృతి చెందిన వ్యక్తిని ప్రకాశ్ రామ్‌గా గుర్తించారు. ప్రమాదానికి గురైన షాలిమార్- చెన్నై కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో అతడు ఉన్నాడని అధికారులు తెలిపారు. ఎస్సీబీ ఆస్పత్రిలోని సర్జరీ వార్డులో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడని వివరించారు. కాగా, ఈ ప్రమాదంలో 1,000 మందికి పైగా గాయపడ్డారు.
ఆప్ నేతలపై ఆరోపణలు...
ఇదిలా ఉండగా.. రాన్‌బాక్సీ మాజీ ప్రమోటర్లు మల్వీందర్ సింగ్, శివిందర్ సింగ్‌ల భార్యలకు బెయిల్ ఇప్పిస్తానని నమ్మించి వారి నుంచి రూ.200 కోట్లు వసూలు చేసిన కేసులో సుకేశ్ అరెస్టయ్యాడు. గతంలో సుకేశ్.. ఆప్ మాజీ మంత్రి సత్యేందర్ జైన్, ఆమ్ ఆద్మీ పార్టీలపై సంచలన ఆరోపణలు చేశారు. మంత్రి సత్యేందర్ జైన్ జైల్లో తనకు రక్షణ కల్పిస్తానని రూ. 10 కోట్లు బలవంతంగా వసూలు చేశారని ఆరోపించారు.