దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఏడాది పొడవునా వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపింది కాంగ్రెస్. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, ఇంఛార్జులు, పీసీసీ అధ్యక్షుల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ తెలిపారు.
" 2021, ఆగస్టు 14, 15 తేదీల్లో అన్ని జిల్లాలో స్వతంత్ర సేనాని, షాహీద్ సమ్మాన్ దివస్‌ను నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. ఆగస్టు 14న సాయంత్రం స్వతంత్ర సమరయోధులు, వారి కుటుంబాలు, వీరుల కుటుంబాలను గౌరవించుకోనున్నాం. ఈ కార్యక్రమం స్వతంత్ర సంగ్రామం జరిగిన లేదా స్వతంత్ర సమరయోధులకు చెందిన ప్రదేశాల్లో నిర్వహిస్తాం. ఆగస్టు 15న ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు స్వతంత్ర మార్చ్ చేపట్టనున్నాం. మండల, జిల్లా కాంగ్రెస్ కమిటీలు ఈ మార్చ్‌ను నిర్వహిస్తాయి. అలాగే.. స్వతంత్ర సంగ్రామంలోని సంఘటనలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రచార కార్యక్రమం ఉంటుంది. పీసీసీలు ఆయా రాష్ట్రాల్లోని స్వాతంత్య్ర సంఘటనలను చూపించేలా రెండు నిమిషాల వీడియోలు సిద్ధం చేసి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయనున్నారు. "
- కేసీ వేణుగోపాల్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి.
భారతీయ జనతా పార్టీపై విమర్శలు గుప్పించారు వేణుగోపాల్. 'వారు నిరంకుశ వ్యక్తులు, సంస్థలు, వారిలో చాలా మంది బ్రిటీష్ పక్షాన ఉండి స్వాతంత్య్ర ఉద్యమాన్ని వ్యతిరేకించారు. మన రాజ్యాంగం, ప్రజాస్వామ్య పునాదిని సవాలు చేస్తూనే ఉన్నారు. వ్యక్తిగత స్వేచ్ఛను అణచివేస్తున్నారు. మత, కులాల పేరుతో విబేధాలు సృష్టిస్తున్నారు. మన స్వేచ్ఛను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. ' అని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: 75 వారాలు.. 75చోట్ల.. 75వ స్వాతంత్య్ర వేడుకలు