విపక్ష కాంగ్రెస్ కూటమి, భాజపా లక్ష్యంగా కేరళ సీఎం పినరయి విజయన్ విమర్శలకు పదును పెట్టారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు రాష్ట్రంలో విధ్వంస కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. దీనికి విపక్ష యూడీఎఫ్ కూటమి సన్నాయి వాయిస్తూ వంత పాడుతోందని ఎద్దేవా చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా 'సంఘ్ పరివార్' కేంద్రంలో తన బలాన్ని ఉపయోగిస్తోందని అన్నారు విజయన్. గత ఐదేళ్లలో అనేక మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్యకమాలను చేపట్టిన కేఐఐఎఫ్బీ వంటి సంస్థలను కేంద్రం నాశనం చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమానికి యూడీఎఫ్ కూటమి తలారిలా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
"విపక్ష నేత రమేశ్ చెన్నితలా కేంద్రంలోని భాజపా ప్రభుత్వానికి బలమైన ప్రతినిధిగా మారిపోయారు. వారు తలారి పాత్ర పోషిస్తారని మేం అసలు ఊహించలేదు. యూడీఎఫ్ తెరిచిన తలుపుల ద్వారా రాష్ట్రంలోకి ప్రవేశించి.. కేంద్ర ఏజెన్సీలు విధ్వంస కార్యకలాపాలకు పాల్పడుతున్నాయి. కేఐఐఎఫ్బీని నాశనం చేసి, రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు వారు వెన్నుపోటు పొడవాలని చూస్తున్నారు."
-పినరయి విజయన్, కేరళ సీఎం
ఎర్నాకులం జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న విజయన్.. చెన్నితలా లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. మళయాలీల నూతన సంవత్సరమైన ఏప్రిల్ 14న ఆహార పదార్థాల పంపిణీనీ అడ్డుకునేందుకు యత్నిస్తున్నారని అన్నారు. వీటి పంపిణీని ఆపేయాలని ఈసీని చెన్నితలా కలిసిన విషయాన్ని గుర్తు చేశారు.
ఇదీ చదవండి: