Congress chintan shivir: ఎన్నికల్లో వరుస ఓటములు, అంతర్గత సవాళ్లు వంటి పరిస్థితులను ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ.. తమ పనితీరుపై ఆత్మవిమర్శ చేసుకునేందుకు చింతన్ శిబిర్ సమావేశాలు నిర్వహిస్తోంది. 2024 ఎన్నికలకు సిద్ధమవుతూనే పార్టీని పూర్తిగా సంస్కరించాలని నేతలు ఆశిస్తున్న నేపథ్యంలో మూడు రోజుల పాటు రాజస్థాన్‌లోని ఉదయ్పుర్లో జరిగే చింతన్ శిబిర్ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ క్రమంలో ఒకే కుటుంబం ఒకే టికెట్ వంటి కీలక ప్రతిపాదనలను కాంగ్రెస్ పరిశీలిస్తోందన్నారు హస్తం పార్టీ ప్రధాన కార్యదర్శి అజయ్ మాకెన్.
"చింతన్ శిబిర్‌లో 'ఒకే కుటుంబం- ఒకే టికెట్' ప్రతిపాదనపై చర్చ జరగుతోంది. ఒకవేళ అదే కుటుంబంలోని మరో సభ్యుడు పార్టీతో గత ఐదేళ్లుగా పనిచేసినట్లయితే.. వారికి మినహాయింపు ఉంటుంది. గాంధీ కుటుంబీకులతో పాటు పార్టీలోని ప్రతి ఒక్కరికీ ఈ నిబంధన వర్తిస్తుంది. మండల కమిటీల ఏర్పాటుపై బూత్, బ్లాక్ స్థాయి కార్యకర్తల మధ్య ఏకాభిప్రాయం, ప్రస్తుతం పార్టీలో పదవీ కాలం గరిష్ఠంగా 3 ఏళ్లు ఉండగా.. దానిని ఐదేళ్లకు పెంచటం, పార్టీ నేతల పనితీరును అంచనా వేసేందుకు ప్రత్యేక విభాగం ఏర్పాటు వంటి ప్రతిపాదనలను కాంగ్రెస్ పరిశీలిస్తోంది."
- అజయ్ మాకెన్, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి.
ప్రస్తుతం కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సోనియా గాంధీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం ఆమె యూపీలోని రాయ్‌బరేలీ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరోవైపు.. కేరళలోని వయనాడ్ లోక్‌సభ ఎంపీగా రాహుల్ గాంధీ కొనసాగుతున్నారు. ప్రియాంక గాంధీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా సేవలందిస్తున్నారు. అయితే.. చింతన్ శిబిరంలో చర్చకు వచ్చిన 'ఒకే కుటుంబం.. ఒకే టికెట్' ప్రతిపాదనకు కాంగ్రెస్ ఆమోదం తెలిపితే.. గాంధీ కుటుంబీకులపై ప్రభావం పడనుందని పలువురు భావిస్తున్నారు. దీంతో సోనియా, రాహుల్, ప్రియాంక పరిస్థితి ఏమిటి? అనే చర్చ మొదలైంది. అయితే, ఈ ప్రతిపాదనలోనే ఐదేళ్ల మెలిక ఉన్నందున వారి పదవులకు వచ్చిన ముప్పేదీ లేదని పలువురు పేర్కొంటున్నారు.
- కాంగ్రెస్ పరిశీలనలోని కీలక సంస్కరణలు: కాంగ్రెస్‌లో సంస్థాగత మార్పులు తీసుకొచ్చేందుకు ఒకే కుటుంబం- ఒకే టికెట్ రూల్ ప్రతిపాదన. అదే కుటుంబంలోని మరో వ్యక్తి ఐదేళ్లు పార్టీ కోసం పని చేసి ఉంటే కొత్త నిబంధన నుంచి మినహాయింపు.
- బూత్, బ్లాక్ స్థాయిల మధ్య మండల కమిటీలను ఏర్పాటు చేయటం. 15-20 బూత్‌లకు ఒక మండల కమిటీ, 3-4 మండల కమిటీలతో బ్లాక్ స్థాయి కమిటీ ఉండేలా చర్యలు
- అన్ని స్థాయుల్లో ఉన్న కమిటీల్లో 50 శాతం మంది 50 ఏళ్లలోపు వారే ఉండాలి
- పార్టీ పదవుల్లో గరిష్ఠంగా ఐదేళ్లు కొనసాగేలా మార్పులు
- హౌస్ సర్వే వ్యవస్థను తీసుకొచ్చేందుకు ప్రజా అంతర్దృష్టి విభాగం ఏర్పాటు
- పార్టీ నేతల పనితీరును అంచనా వేసేందుకు ప్రత్యేక విభాగం
ఇదీ చూడండి: కాంగ్రెస్ 'చింత' తీరేనా? 'యూపీఏ++'తో భాజపాను ఢీకొట్టగలిగేనా?