అరుణాచల్‌ప్రదేశ్‌లో చైనా గ్రామాన్ని నిర్మించిందని అమెరికా పెంటగాన్ వెలువరించిన నివేదికపై దేశంలో దుమారం రేగింది. తాజాగా.. ఈ వ్యవహారంపై స్పందిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వంపై మండిపడింది కాంగ్రెస్. దేశ సరిహద్దుల్లోకి ఎవరూ ప్రవేశించలేదని చెబుతూ.. చైనాకు మోదీ క్లీన్ చిట్ ఇచ్చారని, దానిని ప్రధాని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. ప్రజలకు మోదీ క్షమాపణలు చెప్పాలని పేర్కొంది.
"అరుణాచల్‌ప్రదేశ్‌లో చైనా గ్రామాన్ని నిర్మించిందని అమెరికా పెంటగాన్ తన వార్షిక నివేదికలో చెప్పింది. సరిహద్దులో నిర్మించిన గ్రామాన్ని పౌరుల కోసమే కాకుండా ఆర్మీ కోసం కూడా చైనా వినియోగిస్తోందని తేల్చింది. దీనిపై ప్రధాని సమాధానం చెప్పాలి. అరుణాచల్‌ప్రదేశ్‌లో చైనా చొరబడిందని భాజపా ఎంపీ తపిర్ గావో స్వయంగా ప్రధానికి లేఖ రాశారు. కానీ అలా ఏం జరగలేదంటూ మోదీ, అమిత్‌షా చైనాకు క్లీన్ చిట్ ఇచ్చారు. ఇది దేశ చరిత్రలోనే ఓ చీకటి అధ్యయనం. దీనిని అదునుగా చేసుకుని లద్ధాఖ్, ఉత్తరాఖండ్‌లోనూ చైనా పీఎల్ఏ సైనికులు చొరబడ్డారు. ఇది చాలా తీవ్రమైన సమస్య. ఆ క్లీన్‌చిట్‌ను మోదీ ఉపసంహరించుకోవాలి. సరిహద్దు వెంబడి 2020ఏప్రిల్ నాటి యథాతథ స్థితిని తిరిగి ఎప్పుడు పునరుద్ధరిస్తారనే విషయంపై మోదీ డెడ్‌లైన్ ప్రకటించాలి. మాకు సమాధానాలు కావాలి. మాకు డెడ్‌లైన్స్ కావాలి. దేశ సరిహద్దుల్లోకి చైనా చొరబడలేదని ప్రపంచానికి అబద్ధం చెప్పిన ఈ ప్రభుత్వం మాకు క్షమాపణలు చెప్పాలి."
--- పవన్ ఖేరా, కాంగ్రెస్ ప్రతినిధి.
'ఆ పన్నులు కూడా ఉపసంహరించుకోవాలి..'
పెట్రోల్, డీజిల్‌పై గతేడాది కాలంలో విధించిన పన్నులను మోదీ సర్కారు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది కాంగ్రెస్.
"కొవిడ్ పేరుతో పెట్రోల్‌పై రూ. 13, డీజిల్‌పై రూ 16 (లీటరుకు) పెంచింది కేంద్రం. ఇవన్నీ పన్నుల రూపంలోనే వసూలు చేసింది. జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో ఉన్నందన.. గతేడాది కాలంలో పెంచిన రేట్లను వెంటనే ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి. పన్నులను తగ్గించే అంశంపై కాంగ్రెస్ పాలిత ప్రాంతాలు చర్చిస్తున్నాయి. త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటాయి."
-- పవన్ ఖేరా, కాంగ్రెస్ ప్రతినిధి.
కొవిడ్ కాలంలో పేదలకు ఉచితంగా అందిస్తున్న రేషన్‌ను నిలిపివేయకూడదని విజ్ఞప్తి చేసింది కాంగ్రెస్. కొవిడ్ అనంతరం కాలంలో ఆర్థికవ్యవస్థ పుంజుకోవడం వల్ల ఉచిత రేషన్‌ను కొనసాగించే ప్రతిపాదనేది తమ వద్ద లేదని కేంద్రం ఆహార, ప్రజా పంపిణీ శాఖ చేసిన ప్రకటన నేపథ్యంలో కాంగ్రెస్ ఈ వ్యాఖ్యలు చేసింది.
ఇదీ చూడండి:- తాగి వేరే ఇంటికి వెళ్లిన మాజీ ఎంపీ.. చితకబాదిన యజమాని!