దేశద్రోహం కేసుల అంశంపై లోక్సభలో కాంగ్రెస్, భాజపా మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ కఠినమైన చట్టాన్ని కేంద్రం దుర్వినియోగం చేస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది.
సభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా దేశంలో గత పదేళ్లలో ఎన్ని దేశద్రోహం కేసులు నమోదయ్యాయి? శిక్షా రేటు ఎంత? విచారణ వేగవంతం చేసేందుకు కేంద్రం తీసుకున్న చర్యలేంటి? అని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అడిగారు. టూల్కిట్ కేసులో అరెస్టై, అనంతరం బెయిల్పై విడుదలైన దిశ రవి, సాగు చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రైతు నాయకులపై నమోదైన కేసులను దృష్టిలో ఉంచుకుని ఈ అంశాన్ని లేవనెత్తారు.
రేవంత్ రెడ్డి ప్రశ్నకు కిషన్ రెడ్డి లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. 2014లో 47, 2015లో 30, 2016లో 35, 2017లో 51, 2018లో 70, 2019లో 93 దేశద్రోహం కేసులు నమోదైనట్లు వెల్లడించారు. ఈ కేసుల్లో కేంద్రానికి ప్రత్యక్ష ప్రమేయం లేదని తెలిపారు.
సగం సమాచారమేనా..
కిషన్రెడ్డి సమాధానంపై రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను గత పదేళ్ల వివరాలు అడిగితే 2014 నుంచి 2019 వరకు ఐదేళ్ల సమాచారం మాత్రమే ఇచ్చారన్నారు. ఇలా సగం వివరాలు చెప్పడం సభను తప్పుడు దోవ పట్టించడమేనని విమర్శించారు. 2014 నుంచి కేంద్రాన్ని విమర్శించిన వారిపై దేశద్రోహం కేసులు మోపుతున్నారని ఆరోపించారు.
"2019లో దేశద్రోహం కేసుల్లో శిక్షా రేటు కేవలం 3.3 శాతం. ఈ కేసులు రాజకీయ దురుద్దేశంతో నమోదయ్యాయని దీన్ని బట్టే అర్థమవుతోంది. ఓ యువనేతపై దేశద్రోహం కేసు పెడితే అది నాలుగైదు ఏళ్ల పాటు సాగుతుంది. వాళ్లు ఉద్యోగం పొందలేరు, పాస్పోర్టు, వీసా రాదు. దిశ రవి వంటి ఉద్యమకారిణిలపై కేసులు మోపారు. కానీ కోర్టులో వాటిని రుజువు చేయలేరు." అని రేవంత్ రెడ్డి అన్నారు.
సాగు చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రైతు నాయకులపై మోపిన తప్పుడు అభియోగాలను ఉపసంహరించుకునే ప్రతిపాదనలు ఏమైనా కేంద్రానికి ఉన్నాయా? అని కూడా రేవంత్ రెడ్డి అడిగారు.
కాంగ్రెస్ హయాంలో ఇలా లేదు..
దీనిపై కిషన్ రెడ్డి వివరణ ఇచ్చారు. అన్ని రాష్ట్రాల నుంచి సేకరించిన సమాచారం మేరకే జాతీయ నేర గణాంక విభాగం(ఎన్సీఆర్బీ) ఈ వివరాలు పొందుపరిచిందని తెలిపారు. సగం సమాచారమే ఇచ్చారనడంపై ఆయన మండిపడ్డారు. 2014కు ముందు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు దేశద్రోహం కేసులకు సంబంధించిన వివరాలను ప్రత్యేకంగా నమోదు చేయలేదన్నారు. ఐపీసీ నేరాల్లోనే వాటిని కలిపారని చెప్పారు. మోదీ ప్రభుత్వం వచ్చాక ఈ కేసుల వివరాలను ప్రత్యేకంగా నమోదు చేస్తున్నట్లు వివరించారు.
మరో కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీ కూడా ఇదే విషయం మాట్లాడుతూ.. ఐపీసీ సెక్షన్ 124ఏ కింద దేశద్రోహం చట్టాన్ని ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరించేందుకు దీన్ని ఉపయోగిస్తోందని విమర్శించారు.
దీనిపై స్పందించిన కిషన్రెడ్డి ఎదురుదాడికి దిగారు. ప్రజాస్వామ్యం గురించి కాంగ్రెస్ పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. వారి హయాంలో ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుని జయప్రకాశ్ నారాయణ్, వాజ్పేయీ వంటి నేతలపై అంతర్గత భద్రత నిర్వహణా చట్టాన్ని(ఎంఐఎస్ఏ) ప్రయోగించారని దుయ్యబట్టారు.
ఇదీ చూడండి: సీఏఏపై అన్నాడీఎంకే యూటర్న్- భాజపా పరేషాన్!