ఇటీవల నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతం అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో తమ పార్టీ విఫలం కావడానికి దారితీసిన కారణాలను విశ్లేషించుకునేందుకు కాంగ్రెస్ ఆధ్యక్షురాలు సోనియా గాంధీ.. ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. ఎన్నికల ఫలితాలపై ఆత్మావలోకనం చేసుకోవాల్సి ఉందని సీడబ్ల్యూసీ సమావేశంలో చెప్పిన మరుసటి రోజే.. ఈ కమిటీని ఏర్పాటు చేస్తూ ఆమె నిర్ణయం తీసుకున్నారు.
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీలో కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్, ఎంపీలు మనీశ్ తివారీ, విన్సెంట్ హెచ్.పాలా, జోతిమణి సభ్యులుగా ఉన్నారు. రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని కమిటీకి గడువు విధించారు సోనియా.
కొవిడ్ సహాయక బృందం ఏర్పాటు..
కొవిడ్ సంక్షోభం వేళ దేశవ్యాప్తంగా బాధితుల కోసం సహాయక చర్యలు చేపట్టేందుకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ 13 మంది సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. కేంద్ర మాజీ మంత్రి గులాం నబీ ఆజాద్ నేతృత్వాన ఏర్పాటైన ఈ కమిటీలో సీనియర్ నాయకులు అంబికా సోని, ముకుల్ వాస్నిక్, పవన్‌కుమార్ బన్సల్, ప్రియాంకా గాంధీ వాద్ర, కేసీ వేణుగోపాల్, జైరాం రమేశ్, రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా, మనీశ్ ఛాత్రథ్, అజయ్ కుమార్, పవన్ ఖేడా, గుర్దీప్ సింగ్ సప్పల్, బీవీ శ్రీనివాస్‌లు సభ్యులుగా ఉంటారు.
ఇదీ చూడండి: సోషల్ మీడియా వేదికగా కరోనాపై కాంగ్రెస్ పోరు!