కాంగ్రెస్-ఏఐయూడీఎఫ్ అసోంలో అధికారంలోకి వస్తే జరిగేది చొరబాటుదార్ల రంగప్రవేశమేనని విమర్శించారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. ఆ రాష్ట్రంలో త్వరలోనే ఎన్నికలు జరగనున్న వేళ ఆదివారం నల్బరిలో ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు షా. ఈ క్రమంలో కాంగ్రెస్ హయాంలో దక్కింది రక్తసిక్త పాలన, యువత ప్రాణనష్టమేనని దుయ్యబట్టారు.
"కాంగ్రెస్, బద్రుద్దీన్ అజ్మల్‌కు చొరబాటుదార్ల నుంచి అసోంను విముక్తి చేసే శక్తి ఉందా? ఆ పార్టీలు అధికారంలోకి వస్తే గేట్లు బార్లా తెరిచి మరీ వారిని స్వాగతిస్తాయి. ఎందుకంటే అది వారి ఓటు బ్యాంకు. బ్రిటీషర్ల విభజించు-పాలించు విధానాన్నే కాంగ్రెస్ కొనసాగించింది. ఆదివాసీలు, ఆదివాసీయేతరలు, అసోమీలు, కొండ ప్రాంతీయులు, బోడోలు, బోడోయేతరుల మధ్య చీలిక తీసుకొచ్చింది. కాంగ్రెస్ 20 ఏళ్ల పాలనలో రక్తపాతం మినహా ఇంకేం జరగలేదు. ఆ పార్టీ హయాంలో జరిగిన కాల్పుల్లో 10వేల మంది అసోం యువత ప్రాణాలు కోల్పోయారు. బుల్లెట్లు, నిరసనలు, వరదలు లేని రాష్ట్రం కోసం భాజపాకు ఓటేయండి."
-అమిత్ షా, కేంద్ర హోం మంత్రి
ప్రధాని మోదీ నేతృత్వంలోని భాజపా ప్రభుత్వమే అక్రమ చొరబాటుదారుల నుంచి అసోంను రక్షించగలదని వ్యాఖ్యానించారు షా. భాజపా మతతత్వ పార్టీ అనే కాంగ్రెస్ విమర్శలను తిప్పికొట్టారు. "మాది మతతత్వ పార్టీ అని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. కానీ కేరళలో ముస్లిం లీగ్, అసోంలో ఏఐయూడీఎఫ్‌తో పొత్తు పెట్టుకుంది ఎవరు?" అని నిలదీశారు.
ఏప్రిల్ లేదా మేలో అసోంలో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఏఐయూడీఎఫ్, సీపీఐ, సీపీఐ(ఎం), సీపీఐ(ఎంఎల్), ఏజీఎంతో కలిసి మహాకూటమిగా బరిలోకి దిగనుంది కాంగ్రెస్.
ఇదీ చూడండి: 'కాంగ్రెస్‌లా కాదు.. బోడో ఒప్పందం అమలు చేస్తాం'