Heavy Rains in Hyderabad : తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలు కాస్త తెరపినిచ్చినా... వరద ముప్పు మాత్రం కొనసాగుతోంది. హైదరాబాద్‌లో లోతట్టు ప్రాంతాలు ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్నాయి. డ్రైనేజీలు, నాలాలు పొంగిపొర్లుతున్నాయి. పలుచోట్ల రహదారులు కూడా దెబ్బతిన్నాయి. కొన్నిచోట్ల రహదారులపై వరద ప్రవహిస్తోంది. ఈ క్రమంలో రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. జనం రోడ్డుపై నడవలేని పరిస్థితి తలెత్తింది. అలాగే పలు చోట్ల చెట్లు విరిగి రోడ్డుపై పడడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తింది.
Colonies Flooded with Rain Water in Hyderabad : కుత్బుల్లాపూర్ గాజులరామారంలోని ఒక్షిత్ ఎంక్లేవ్‌లోని కాలనీలను వరద ముంచెత్తింది. మోకాలి లోతు నీటి ప్రవాహంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాజేంద్రనగర్ సర్కిల్ శాస్త్రిపురంలోని మదీనా కాలనీలోకి వరద నీరుచేరింది. ఇళ్లలోకి నీరు చేరి కాలనీవాసులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. సికింద్రాబాద్ అడ్డగుట్ట డివిజన్‌లోని ఆర్సీ మైదానం సమీపంలో పది గుడిసెలు నేలమట్టం కావడంతో నిరు పేదలు రోడ్డున పడ్డారు. లంగర్‌హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎండీ లైన్స్ వద్ద చెట్లు నేలకు ఒరిగి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. కొంపల్లి-బహదూర్‌పల్లి ప్రధాన రహదారిలో కల్వర్టు వద్ద రోడ్డుపై వరద ప్రవాహంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది.
కలుషితాలు వెదజల్లుతున్న కూకట్ పల్లి ఐడీపీఎల్ చెరువు : హైదరాబాద్ కూకట్‌పల్లిలో ఐడీపీఎల్ చెరువు రసాయన కలుషితాలను వెదజల్లుతోంది. నురగ సమీప ప్రాంతాల్లో గాలి ద్వారా వ్యాపిస్తోంది. దుండిగల్ మున్సిపాలిటీలోని బహదూర్‌పల్లిలో ప్రధాన రహదారులు, కాలనీ రోడ్లు చెరువులను తలపిచాయి. లింగంపల్లి అండర్‌పాస్ దగ్గర నిరు నిలిచి రాకపోకలు సాగించేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
నిండుకుండలా హైదరాబాద్ జంటజలాశయాలు : మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు హుస్సేన్‌సాగర్ గరిష్ఠ నీటిమట్టానికి చేరుకుంది. సరూర్‌నగర్ చెరువుకు ప్రవాహం కొనసాగుతుండటంతో గేట్లు తెరిచి దిగువకు నీటిని వదిలారు. చెరువు కింద ఉన్న కోదండరామ్‌నగర్ కాలనీలో నీరు చేరింది. జోరువానలకు జంట జలాశయాలైన హిమాయత్ సాగర్, ఉస్మాన్‌సాగర్ నిండుకుండాలను తలపిస్తున్నాయి. దీంతో హిమాయత్ సాగర్ గేట్లు తెరిచి నీటిని దిగువకు వదులుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో సికింద్రాబాద్ పరిధిలో ఉన్న శిథిలావస్థకు చేరుకున్న భవనాలకు జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు అందజేశారు. పూరాతన భవనాలలో ఉంటున్న వారిని పునరావాస కేంద్రాలకు తరలించారు.
పిల్లిని కాపాడిన రెస్క్యూ టీం : వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ డీఆర్ఎఫ్ ఏర్పాటు చేసిన కాల్ సెంటర్‌కు మొత్తం 47 ఫిర్యాదులు వచ్చినట్లు డీఆర్ఎఫ్ డైరెక్టర్ ప్రకాష్ రెడ్డి వెల్లడించారు. మొత్తం 47 ఫిర్యాదులు అందగా 36 పరిష్కారం చేసినట్లు తెలిపారు. అందులో ఒక పిల్లిని కూడా రెస్క్యూ చేసి కాపాడినట్లు ప్రకటించారు. 33 చెట్లు పడిపోయినట్లు, 11 వాటర్ నిలిచిన, 2 గోడలు కూలిన ఫిర్యాదులు వచ్చాయన్నారు. మిగతా ఫిర్యాదులను పరిష్కారం చేస్తున్నట్లు ప్రకాష్‌రెడ్డి వెల్లడించారు.
ఇవీ చదవండి :