సుప్రీం కోర్టు వేసవి సెలవుల సమయంలో అత్యవసర కేసులపై విచారణ జరిపేందుకు.. మార్గదర్శకాలు జారీ చేశారు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ. ఈ మేరకు వారంలో రెండు రోజులు వర్చువల్‌గా విచారణ జరపనున్నట్లు సుప్రీంకోర్టు సర్క్యులర్ విడుదల చేసింది.
మొదటి దశ సెలవుల్లో.. మే 10 నుంచి మే 16 మధ్య రెండు డివిజన్ బెంచ్‌లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేసుల విచారణ జరపనున్నాయి. మంగళవారం, శుక్రవారం.. మాత్రమే ఈ వర్చువల్ విచారణ ఉంటుంది.
మే17 నుంచి మే25 మధ్య మరో రెండు డివిజనల్ బెంజ్‌లు వర్చువల్‌గా విచారణ జరపనున్నట్లు సర్క్యులర్‌లో సుప్రీంకోర్టు పేర్కొంది.
గురువారం వరకు నమోదైన కేసులపై మంగళవారం విచారణ జరపనున్నట్లు సుప్రీం కోర్టు తెలిపింది. గురువారం నుంచి సోమవారం వరకు నమోదైన కేసులపై శుక్రవారం విచారణ జరపనున్నట్లు స్పష్టం చేసింది.
మే 26 నుంచి జూన్ 10 వరకు రెండో దశ వేసవి సెలవులు కాగా.. జూన్ 10 నుంచి జూన్ 27 వరకు సుప్రీం కోర్టు మూడో దశ వేసవి సెలవులు కొనసాగనున్నాయి.
జూన్ 27న సుప్రీంకోర్టు తిరిగి కార్యకలాపాలు ప్రారంభించనుంది.
ఇదీ చదవండి:కరోనా నిబంధనలు ఉల్లంఘించిన 46 మంది అరెస్ట్