అమ్మభాష కమ్మదనం, తెలుగుభాష తియ్యందనంపై మక్కువ కలిగిన జస్టిస్ ఎన్. వి. రమణ.. తెలుగువాడిగా పుట్టినందుకు గర్వించాలని చెబుతుంటారు. పాశ్చాత్యభాష మోజులో పడి మాతృభాష నిర్లక్ష్యం తగదనే ఆయన.. అభివృద్ధికి భాష అడ్డు కాదంటారు. మాతృభాషా పరిరక్షణకు ప్రభుత్వాలు, సాహితీ సంస్థలు నడుంకట్టాలని చెబుతారు.
మాతృభాషను జాతి ఔన్నత్యానికి ప్రతీకగా అభివర్ణించే జస్టిస్ ఎన్. వి. రమణ.. అందమైన, మధురమైన తెలుగుభాషను.. భావితరాలకు అందించడం మన బాధ్యతని గుర్తుచేస్తుంటారు. దీనిని విస్మరిస్తే.. భావితరాలు మనల్ని క్షమించవని ఆయన అభిప్రాయం. తెలుగువారు భాషాభిమానులే కానీ దురభిమానులు కారనే ఆయన.. అమ్మ ఒడిలో ప్రేమానురాగాల్ని, అమ్మభాషలో.. మృదుభాషా చాతుర్యాన్ని అలవరుచుకున్న తెలుగు ప్రజలు.. మృదు స్వభావులు అని చెబుతుంటారు. అయితే తెలుగురాష్ట్రాలు ఏర్పడిన తర్వాత.. గత కొన్నాళ్లుగా తెలుగుభాష ఉనికిపై పరోక్షదాడులు జరుగుతున్నాయన్న జస్టిస్ రమణ.. సజీవ వాజ్మయ సౌందర్యానికి సమాధులు కట్టే దుశ్శకునాలు కనిపించడం దురదృష్టకరమని చెబుతుంటారు. తెలుగుభాష గొప్పదనాన్ని ప్రజలకు తెలియజేసే బాధ్యత ప్రభుత్వాలు, సాహితీ సంస్థలు తీసుకోవాలంటారు.
న్యాయవ్యవస్థలో తెలుగు...
న్యాయస్థానాల్లో తెలుగును ప్రోత్సహించాలనేది జస్టిస్ ఎన్.వి. రమణ కోరిక. కేసు విచారణ ప్రక్రియ కక్షిదారుకు అర్థమయ్యేలా స్థానిక భాషలో ఉండాలని, న్యాయవాదులు ఏం మాట్లాడుతున్నారో తెలియరాని స్థితిలో వారుండకూడదనేది ఆయన ఉద్దేశం. అందుకే.. న్యాయవ్యవస్థలో తెలుగు అమలు చేయాల్సిన అవసరం ఉందని చెబుతుంటారు. ఏపీ జ్యుడిషియల్ అకాడమీ అధ్యక్షుడిగా పనిచేసిన సమయంలో ఆ దిశగా కృషిచేశారు.