Civils 2022: సివిల్ సర్వీసెస్ పరీక్ష(సీఎస్‌ఈ)-2022కు సంబంధించి అభ్యర్థులకు అదనపు అవకాశాలు ఇచ్చే ప్రతిపాదన ఏదీ పరిశీలనలో లేదని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ గురువారం రాజ్యసభకు తెలియజేశారు. కరోనా పరిస్థితుల కారణంగా 2022 సివిల్స్ పరీక్షల కోసం అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు, అదనపు అటెంప్ట్‌లు మంజూరు చేయాలంటూ కొంతమంది అభ్యర్థులు సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే.. ఈ ఏడాది పరీక్షకు సంబంధించి అదనపు అవకాశాలు అందించడాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందా? అని రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ఈ మేరకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
'అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుల ఆధారంగా.. ఈ అంశాన్ని పరిశీలించాం. సివిల్ సర్వీసెస్ పరీక్ష అటెంప్ట్‌లు, వయోపరిమితికి సంబంధించిన ప్రస్తుత నిబంధనలను మార్చడం సాధ్యం కాదు' అని మంత్రి వెల్లడించారు. దీని దృష్ట్యా.. అటువంటి ప్రతిపాదన ఏదీ పరిశీలనలో లేదని చెప్పారు. ఐఏఎస్, ఐఎఫ్‌ఎస్, ఐపీఎస్ తదితర సర్వీసులకు అధికారులను ఎంపిక చేయడానికి యూపీఎస్సీ ఏటా ఈ పరీక్షలను నిర్వహిస్తుంది.
పనివేళలు పెంచే ప్రతిపాదనేది లేదు..
దేశంలోని ప్రభుత్వ సంస్థల్లో పని గంటలను రోజుకు ఎనిమిది నుంచి 12 గంటలకు పెంచే ప్రతిపాదన ఏదీ ప్రభుత్వ పరిశీలనలో లేదని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ రాజ్యసభకు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం.. అన్ని ప్రభుత్వ సంస్థల్లో పని గంటలను రోజుకు 8 నుంచి 12 గంటలకు పెంచే ప్రక్రియలో ఉందా? అనే ప్రశ్నకు ఆయన ఈ మేరకు సమాధానం ఇచ్చారు.
ఇదీ చూడండి: 'అగ్రదేశాల కంటే వేగంగా ఎదుగుతున్నాం.. పైచేయి మనదే'