నాగాలాండ్‌కు చెందిన 80 ఏళ్ల వృద్ధ దివ్యాంగురాలిని తనిఖీల పేరిట సీఐఎస్ఎఫ్ సిబ్బంది వేధించారని ఆరోపించారు ఆమె కుమార్తె. ఆమెను పూర్తిగా వివస్త్రను చేశారని, ఇదేం పద్ధతని మండిపడ్డారు. గువాహటిలోని లోక్‌ప్రియ గోపినాథ్ బొర్దోలోయ్ విమానాశ్రయంలో గురువారం ఈ ఘటన జరిగిందని ట్వీట్ చేశారు ప్రముఖ ఆంథ్రపాలజిస్ట్, రచయిత డాలీ కికాన్.
"గువాహటి విమానాశ్రయంలో సీఐఎస్ఎఫ్ సెక్యూరిటీ చెక్ పాయింట్ దగ్గర నా 80 ఏళ్ల తల్లిని వివస్త్రను చేశారు. టైటానియం హిప్ ఇంప్లాంట్ ఉందని రుజువు చూపించాలంటూ భద్రతా సిబ్బంది ఇలా చేశారు. ఆమె లోదుస్తులు కూడా తీయించి పూర్తిగా వివస్త్రను చేశారు ఎందుకిలా? పెద్దవాళ్లతో వ్యవహరించే పద్ధతి ఇదేనా? నా తల్లితోపాటు ఉన్న నా బంధువునూ భద్రతా సిబ్బంది వేధించారు. ఆమె రాసిన ఫిర్యాదు పత్రాన్ని లాగేసుకున్నారు. దయచేసి ఎవరైనా సాయం చేయండి" అని వరుస ట్వీట్లు చేశారు డాలీ. ఈ వ్యవహారంపై పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పందించారు. దర్యాప్తు చేసి, తగిన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.