2017లో తమిళనాడులో వచ్చిన ఓఖీ తుపాను వలన గాయపడిన ఓ పెద్ద రాబందు.. ఎగరలేని స్థితిలో అటవీ అధికారుల చెంతకు చేరింది. దాదాపు 5 సంవత్సరాల పాటు ఆ రాబందుకు ఆవాసం కల్పించిన తమిళనాడు అటవీ శాఖ అధికారులు.. గురువారం రాజస్థాన్‌కు చేర్చారు. దాని ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఓ ప్రత్యేక బోనులో పెట్టి.. విమానంలో రాజస్థాన్‌కు తరలించారు. త్వరలోనే ఇతర రాబందుల సమూహంతో కలపనున్నారు.
ఏంటీ రాబందు కథ?
2017లో ఓఖీ తుపాను తమిళనాడు తీరాన్ని తాకినప్పుడు.. వలస వచ్చిన ఓ పెద్ద రాబందు గాయపడి తన గుంపు నుంచి తప్పిపోయింది. దాన్ని గుర్తించిన స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అది ఓఖీ తుపాను కారణంగా గాయపడింది కనుక దానికి 'ఓఖీ' అని పేరు పెట్టారు. దాదాపు 5 సంవత్సరాల పాటు తమిళనాడులోని కన్యాకుమారిలో అటవీశాఖ సిబ్బంది దాన్ని సంరక్షించారు. ప్రస్తుతం ఆరోగ్యం కుదుటపడి.. ఎగరగలిగే స్థితికి చేరుకున్నందున ఆ రాబందును తిరిగి తన గుంపుతో కలపడానికి జోధ్‌పుర్‌కు గురువారం విమానంలో తరలించారు.
తమిళనాడు నుంచి రోడ్డు మార్గంలో 2300 కిలోమీటర్ల దూరంలోని జోధ్‌పుర్‌లో ఉన్న మాచియా బయోలాజికల్ పార్క్‌కు రాబందును తీసుకువెళ్లాలని అధికారులు తొలుత భావించారు. అయితే.. మరీ ఇంతటి దూర ప్రయాణం చేస్తే రాబందు ఆరోగ్యం దెబ్బతినవచ్చని అనుకున్నారు. అందుకే ఓఖీని ఓ బోనులో పెట్టి ఎయిర్ ఇండియా విమానంలో గురువారం మధ్యాహ్నం తరలించారు. దానితో పాటుగా కన్యాకుమారి పారెస్ట్ ఆఫీసర్ కూడా జోధ్‌పుర్‌కు వెళ్లారు.
'రాబందును ముందుజాగ్రత్త చర్యగా కొన్ని రోజులు నిర్బంధంలో ఉంచుతారు. ఆ తరువాత ఓఖీని తన గుంపుతో కలిసేందుకు విడిచిపెడతారు' అని మాచియా పార్క్ అటవీ సంరక్షణా అధికారి కేకే వ్యాస్ చెప్పారు.
'ఓఖీ అనే ఓ అందమైన రాబందు కథ అందరి హృదయాలను కలిచివేస్తుంది. 2017 ఓఖీ తుపానులో గాయపడిన ఓ రాబందు.. ఎయిర్ ఇండియా విమానం ద్వారా తమిళనాడు నుంచి రాజస్థాన్‌కు తన గుంపుతో కలిసేందుకు పయనమైంది' అని తమిళనాడు అటవీశాఖా కార్యదర్శి సుప్రియా సాహూ ట్వీట్ చేశారు.
ప్రపంచంలో అతిపెద్ద రాబందులుగా గుర్తింపు పొందిన ఇవి.. అక్టోబర్ నెలలో ఉజ్బెకిస్తాన్, మంగోలియా మీదుగా పోర్చుగల్, ఫ్రాన్స్ నుంచి భారతదేశానికి వస్తాయి. మరికొన్ని రోజుల్లో ఈ గుంపు జోధ్‌పుర్‌కు వచ్చినప్పుడు వాటితో పాటు ఈ ఓఖీని కూడా విడిచిపెడతామని అధికారులు తెలిపారు. రాజస్థాన్‌లో.. రాబందుల కోసం ప్రత్యేక పశువుల కళేబరాల డంపింగ్ యార్డ్లు కేరు అనే ప్రాంతంలో ఉన్నాయి. ఆ ప్రాంతానికి ఆ జాతి రాబందులు వస్తాయి. అందుకే.. కేరునే ఓఖీని విడిచి పెట్టడానికి అనువైన ప్రాంతమని రాజస్థాన్ అటవీ అధికారులు తెలిపారు.