దేశంలో కరోనా రెండో దశ ఉద్ధృతమవుతూ ఎంతోమందిని బలిగొంటోంది. ఆసుపత్రుల్లో పడకలు, ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఐసీయూల్లో బెడ్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఎక్కడ చూసినా.. హౌస్‌ఫుల్. ఇలాంటి పరిస్థితుల్లో ఓ యువకుడి కోసం తాను చికిత్స పొందుతున్న ఐసీయూ పడకను ఇచ్చి తన జీవితాన్నే త్యాగం చేశాడో వృద్ధుడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో జరిగింది.
ఇదీ జరిగింది..
నాగ్‌పుర్‌కు చెందిన నారాయణ రావు దభాద్కర్ అనే వ్యక్తి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)లో వలంటీర్‌గా చేస్తున్నారు. తాను ఎవరిని కలిసినా చాక్లేట్ ఇచ్చే అలవాటుతో చాక్లేట్ అంకుల్‌గా గుర్తింపు పొందారు. అయితే.. వారం రోజుల క్రితం ఆయన కరోనా వైరస్ బారినపడ్డారు. వైద్యులు ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకోవాలని చెప్పారు. కానీ, ఆరోగ్యం క్షీణించటం వల్ల కుటుంబ సభ్యులు నగరంలోని ఇందిరా గాంధీ మున్సిపల్ ఆసుపత్రికి తరలించారు.
ఐసీయూలో చేరిన కొన్ని గంటల తర్వాత తన భర్తను చేర్చుకోవాలని ఆసుపత్రి ఎదుట ఓ మహిళ వైద్యులను వేడుకుంటున్న దృశ్యాన్ని ఆయన చూశారు. దాంతో చలించిపోయిన దభాద్కర్ తనను వెంటనే డిశ్చార్జి చేసి తన పడకను ఆ మహిళ భర్తకు కేటాయించాలని వైద్యులను కోరారు. అందుకు వైద్యులు నిరాకరించారు. అది ఆయన ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరించారు.
వైద్యులు చెబుతున్నా వినకుండా తన ఐసీయూ పడకను ఆ మహిళకు ఇచ్చారు దభాద్కర్. వైద్యులకు ఓ లేఖ రాశారు 'నా జీవితంలో అన్నీ అనుభవించాను. కాబట్టి, నాకు కేటాయించిన ఐసీయూ బెడ్‌ను అవసరమైన వారికి ఇచ్చేస్తున్నా' అని లేఖలో పేర్కొన్నారు.
దభాద్కర్ను ఇంటికి తీసుకువేళుతున్న క్రమంలోనే ఆయన స్వర్గస్తులయ్యారు.
ఇదీ చూడండి: వింత: పనస చెట్టుకి జామకాయ!