China Naming Arunachal Pradesh: గురువారం అరుణాచల్ ప్రదేశ్లోని 15 ప్రాంతాలకు అధికారిక చైనీస్ పేర్లు పెట్టింది చైనా ప్రభుత్వం. దీనిపై భారత్ తీవ్రంగా స్పందించింది. అరుణాచల్ భారత్లో అంతర్భాగమని, చైనా ఇలాంటి చర్యలు మానుకోవాలని హితవు పలికింది. దీంతో చైనా శుక్రవారం ఈ విషయంపై వివరణ ఇచ్చింది. 15 ప్రాంతాలకు పేర్లు పెట్టడాన్ని సమర్థించుకుంది. అరుణాచల్ దక్షిణ టిబెట్లో భాగమని, అక్కడ ఎన్నో సంప్రదాయ తెగలు చాలా ఏళ్లుగా జీవిస్తున్నాయని చెప్పింది. స్వయంప్రతిపత్తి గల ప్రాంతానికి తాము పేర్లు పెట్టడంలో తప్పేముందని మరోమారు మొండి వాదన చేసింది.
China naming 15 places
అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతాలకు చైనా పేర్లు పెట్టినంత మాత్రాన వాస్తవం మారదని, అది ఎప్పటికీ భారత భూభాగమేనని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ స్పష్టం చేశారు. డ్రాగన్ దేశం ఇలా చేయడం కొత్తేం కాదని, 2017లో కూడా ఇలానే కొన్ని ప్రాంతాలకు పేర్లు పెట్టిందని గుర్తు చేశారు.
కాంగ్రెస్ విమర్శలు..
అరుణాచల్ ప్రాంతాలకు చైనా పేర్లు పెట్టడంపై కాంగ్రెస్ స్పందించింది. ఇది మోదీ ప్రభుత్వం వైఫల్యానికి నిదర్శనమని మండిపడింది. ఇంత జరుగుతున్నా కేంద్ర ఏమీ చేయకపోవడం అశక్తతను రుజువు చేస్తోందని పేర్కొంది. భారత భూభాగంలో చైనా రెండు గ్రామాలను నిర్మించినట్టు ఉపగ్రహ ఛాయాచిత్రాల ఆధారాలున్నా కేంద్రం మౌనం వహించడం దారుణమంది కాంగ్రెస్. భాజపాను 'బీజింగ్ జనతా పార్టీ' అని అభివర్ణిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేసింది.