Snakes Dowry : ఛత్తీస్‌గఢ్‌లోని కొర్బా ప్రాంతానికి చెందిన ఓ గిరిజన తెగ.. వింత ఆచారాన్ని పాటిస్తోంది. పెళ్లిళ్ల సమయంలో.. సన్వారా తెగలోని వధువు తరఫు వారు వరుడికి సర్పాలను కట్నంగా ఇచ్చుకుంటారు. మొత్తం 9 రకాల జాతులకు చెందిన 21 సర్పాలను.. అల్లుడికి కానుకగా ఇస్తారు. అలా కట్నంగా పాములను ఇవ్వలేని ఆడపిల్లను సన్వారా తెగలో ఎవరూ పెళ్లి చేసుకోరు. వివాహ సమయంలో మెట్టినింటికి 9 జాతుల పాములను తీసుకురాలేకపోతే.. ఆ పెళ్లి అసంపూర్ణంగా మిగిలిపోతుందని సన్వారా గిరిజనులు భావిస్తారు.
"ఇది ఇక్కడ ముఖ్యమైన సంప్రదాయం. మా పూర్వీకులు కట్నం కోసం 60 పాములను సమర్పించేవారు. తర్వాత వాటి సంఖ్య తగ్గిపోయింది. ఇప్పుడు కట్నంలో భాగంగా 21 సర్పాలను మాత్రమే ఇచ్చుకుంటున్నాం. పాములను ఇవ్వకపోతే, మా సమాజంలో ఎవరికీ వివాహం జరగదు. కాబట్టి, మేము ఎలాగైనా పాములను వెతకాలి."
-- కటంగి, సన్వారా తెగ గిరిజనుడు
ఒకప్పుడు విషపూరిత పాములే కట్నం..
Snakes As Dowry : పాములను కట్నంగా తీసుకుని వాటిని ప్రజల ముందు ఈ తెగవారు ప్రదర్శిస్తారు. వాటితో నృత్యం చేయించడం వంటివి చేసి జీవనం సాగిస్తారు. ఒకప్పుడు వీరు విషపూరిత సర్పాలను కూడా కట్నంగా ఇచ్చుకునేవారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వం అందుకు అనుమతించట్లేదు. కేవలం విషరహిత పాములను మాత్రమే పట్టుకునేందుకు గిరిజనులకు అనుమతిస్తోంది. స్థానిక సంప్రదాయాలను గౌరవించి వీరికి ఈ అనుమతులు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు.
జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నాం: అటవీ శాఖ అధికారులు
"సన్వారా తెగ ప్రజలు ఉండే ఈ కోర్కోమా గ్రామం నా అధికార పరిధిలోకి వస్తుంది. జీవనోపాధి కోసం విషం లేని పాములను పట్టుకోవడం, వాటిని ప్రజల ముందు ప్రదర్శించి వారు జీవనం సాగిస్తారు. మేము వారికి జాగ్రత్తగా ఉండాలని, విషం లేని పాములను మాత్రమే పట్టుకోవాలని తరచూ సూచిస్తాం. ఎందుకంటే ఇది చాలా ప్రమాదకరం." అని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సియారామ్ కర్మాకర్ తెలిపారు. అయితే తరతరాలుగా వస్తున్న ఈ ఆచారాన్ని కొనసాగించేందుకే ఇక్కడి యువకులు మొగ్గు చూపుతున్నారు.