పిల్లలకు మెరుగైన విద్య అందించి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దాల్సిన ఉపాద్యాయులే పదాలు రాయడంలో తడబడితే? ఛత్తీస్‌గఢ్‌లోని కవర్ధా జిల్లా లొహార గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఇదే జరిగింది. ఎంఏ హిందీ పట్టా పొందిన ఓ ఉపాధ్యాయుడు డీఈఓ చెప్పిన ఓ హిందీ పదాన్ని రాయడానికి తడబడ్డాడు. ఎన్నిసార్లు ప్రయత్నించినా ఆ పదాన్ని సరిగ్గా రాయలేకపోయాడు.
ఇదీ జరిగింది..
లొహార గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో డీఈఓ రాకేశ్ పాండే ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. విద్యార్థులను టెక్ట్స్‌బుక్స్‌లోని పాఠాలను చదవమనగా వారు తడబడ్డారు. కింద తరగతికి చెందిన పుస్తకాల్లోని పాఠాలను కూడా వారు చదవలేకపోయారు. ఈ క్రమంలో అక్కడ హిందీ టీచర్‌ను పరీక్షించారు. హిందీలో అంత్యక్రియలు అని అర్థం వచ్చే 'అంతిష్ట్య' అనే పదాన్ని కాగితం మీద రాయమనగా.. అతను రాయలేకపోయాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా తడబడుతూ వచ్చాడు. పాఠశాల నిర్వహణ, ఉపాధ్యాయుల తీరుపై డీఈఓ అసంతృప్తి వ్యక్తం చేశారు. పిల్లలకు నాణ్యతలేని విద్య అందుతుండటం నిరుత్సాహాన్ని కలిగిస్తోందన్నారు.
ప్రతినెల ఐదు స్కూళ్లు..
ప్రభుత్వ పాఠశాలల దీనస్థితిపై స్పందించిన డీఈఓ.. విద్యావ్యవస్థలో ఎన్నో మార్పులు తేవాల్సి ఉందన్నారు. సరైన బోధనా పద్ధతిని ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇక నుంచి ప్రతినెల ఐదు ప్రభుత్వ పాఠశాలలో తనిఖీలు నిర్వహించి.. పురోగతిని పర్యవేక్షిస్తానని తెలిపారు.
ఇదీ చదవండి : ఒకప్పుడు బాక్సింగ్‌లో ఛాంపియన్.. కానీ ఇప్పుడు..