Chandrababu on MLC Elections: ఉగాది పంచాగాన్ని ప్రజలు 2రోజుల ముందే ఓటు రూపంలో చెప్పారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై స్పందించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలు జగన్ వర్సెస్ ప్రజలుగా జరగనున్నాయని ఆయన స్పష్టం చేశారు. వైసీపీని ప్రజలిక వై చ్ఛీ పో అంటున్నారని దుయ్యబట్టారు.
ప్రజా విజయం: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముగ్గురు తెలుగుదేశం అభ్యర్థుల గెలుపు ప్రజా విజయమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రజా విజయాన్ని తిరుగుబాటు గా చూడాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం నుంచీ తామేం కోరుకుంటున్నామో ఓటు రూపంలో ప్రజలు స్పష్టం గా చెప్పారన్నారు. తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఓటు ఆయుధం అన్న అంబేద్కర్ స్ఫూర్తితో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు ఓటేశారని తెలిపారు. ఈ ఎన్నికల ద్వారా టీడీపీ పై నమ్మకంతో పాటు ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజలు చాటారని చంద్రబాబు అభివర్ణించారు. ప్రీ-ఫైనల్...,సెమీ ఫైనల్...,రెఫరెండం అని అధికార పార్టీ నేతలు చాలా మాటలు చెప్పటంతో పాటు విశాఖ రాజధానికి ఈ ఎన్నికలు రెఫరెండం అన్నారని చంద్రబాబు గుర్తుచేశారు. చైతన్యవంతులైన ప్రజలకు వీళ్ళ భాగోతాలు అంతా తెలుసునని ఆయన అన్నారు.
మొదలైన ప్రజా తిరుగుబాటు: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జగన్ అరాచకాలు భరిద్దామా, లేక రాష్ట్ర భవిష్యత్తు చూసుకుందామా అనేదే ప్రజల ఆలోచన అని చంద్రబాబు తెలిపారు. పులివెందుల్లోనూ తిరుగుబాటు మొదలైందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో మొదలైన ప్రజా తిరుగుబాటు ప్రారంభం మాత్రమేనన్నారు. తోటి వాళ్లను నేరాల్లో భాగస్వామ్యం చేయడం జగన్ నైజమని విమర్శించారు. అధికారులను...,పారిశ్రామిక వేత్తలను జైళ్లకు తీసుకెళ్లారని మండిపడ్డారు. ఇప్పుడు ఏపీ ప్రజలను క్రైమ్ లో భాగస్వాములను చేయాలని చూస్తున్నారని ఆక్షేపించారు. జగన్ పని అయిపోయిందన్న చంద్రబాబు, ఇక ఏ ఎన్నికల్లోనూ గెలవలేరన్నారు. తెలుగుదేశం పార్టీది జనబలం, వైసీపీది ధనబలమని దుయ్యబట్టారు. తాము ప్రజాస్వామాన్ని నమ్మితే...,జగన్ అరాచకాలు నమ్మాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ అహంకారి అయినా ఫర్వాలేదు కానీ అతనో సైకో అని విమర్శించారు.
పిల్లలు ఫ్యాన్ రెక్కలు విరిస్తే.. జైళ్లకు పంపుతారా అని చంద్రబాబు మండిపడ్డారు. జంగారెడ్డి గూడెంలో ఫ్యాన్ సరిగా పని చేయడం లేదని చెప్పడమే వాళ్లు చేసిన తప్పా అని ప్రశ్నించారు. ఉగ్రవాదులు కూడా భయపడే చర్యలు వైసీపీ చేస్తోందని ధ్వజమెత్తారు. పులివెందుల రాంగోపాల్ రెడ్డి గెలిస్తే జగన్ తట్టుకోలేరా అని నిలదీశారు. జగన్ను పులివెందుల ప్రజలు గెలిపిస్తే.. పులివెందుల రాంగోపాల్ రెడ్డిని మూడు జిల్లాలు ప్రజలు గెలిపించారన్నారు. రేపట్నుంచి మండలిలో పులివెందుల రాంగోపాల్ రెడ్డి ముఖం చూడక తప్పదని స్పష్టం చేశారు.
ఉపాధ్యాయ ఎన్నికల్లో వైసీపీ గెలుపు: ఉపాధ్యాయులను ఈ ప్రభుత్వం పెట్టినన్ని ఇబ్బందులు ఇంకెవరూ పెట్టలేదని చంద్రబాబు విమర్శించారు. టీచర్లను పోలింగు విధుల నుంచి తీసేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేటు రంగంలో వాళ్లని తెచ్చి టీచర్ల ఎన్నికల్లో ఓటర్లుగా నమోదు చేయించారని ధ్వజమెత్తారు. ఉపాధ్యాయ ఎన్నికల్లో వైసీపీ గెలుపు బాధాకరమన్నారు. ప్రలోభాలకు గురయ్యారో, ఆర్జేడీ స్థాయి అధికారుల బెదిరింపులో కానీ ఉపాధ్యాయ ఎన్నికల్లో వైసీపీ గెలిచిందని అభిప్రాయపడ్డారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వైసీపీకి భవిష్యత్తులో ఉపాధ్యాయులు సహకరించకూడదని కోరారు. పట్టభద్రుల ఎన్నికల్లో రెండో ఓటు ప్రాధ్యాన్యతకు సహకరించిన వామపక్షాలకు చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు.
కౌంటింగ్ కోసం పోరాడాల్సి వచ్చింది: లబ్దిదారులకు 10 ఇచ్చి.. వారి వద్ద నుంచి 100 గుంజుకుంటున్నారని చంద్రబాబు విమర్శించారు. తెలుగుదేశం అధికారంలోకి రావడం ఖాయమని ఎమ్మెల్సీ ఎన్నికలు ఫలితాలతో తేలిందని స్పష్టం చేశారు. ప్రజా భాగస్వామ్యంతోనే జగన్ను ఓడించడం సాధ్యమన్నారు. ఎన్నికల నిర్వహణలో.. కౌంటింగ్ కోసం పోరాడాల్సి వచ్చిందని తెలిపారు. ఎన్నికల సంఘం ఆదేశాలను వైసీపీ ధిక్కరించేలా వ్యవహరించిందని ధ్వజమెత్తారు. అనంత ఎస్పీ ఫకీరప్ప ప్రభుత్వానికి పాద సేవ చేస్తున్నారని ఆక్షేపించారు. ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గెలిచారని ప్రకటించిన తర్వాత కూడా డిక్లరేషన్ ఫారం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా మంది పోలీసులు, ఉద్యోగులు తప్పని సరి పరిస్థితిలో ప్రభుత్వం చెప్పినట్టు చేస్తున్నారన్నారు. తాత్కాలికంగా ఇబ్బందులు ఎదురైతే కొన్నాళ్లు ఎదుర్కోక తప్పదన్నారు.
ఇవీ చదవండి: