Chandrababu Comments on CM Jagan Mohan Reddy: జగన్‌తో లాభం లేదని ప్రజా సర్వే చెప్తుంటే, ఇక ఎమ్మెల్యేలను బదిలీ చేసి ఏం లాభమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఐదేళ్లుగా జగన్‌కి అందింది తాను దోచుకుంటే, ఎమ్మెల్యేలకు అందింది వాళ్లు దోచుకున్నారని దుయ్యబట్టారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు సమక్షంలో విజయసాయిరెడ్డి బావమరిది ద్వారాకానాథ్ రెడ్డి, దాడి వీర భద్రరావు, సి. రామచంద్రయ్య, బాపట్ల జెడ్పీటీసీ వేణుగోపాల్ రెడ్డి తదితరులు తెలుగుదేశం కండువాలు కప్పుకున్నారు.
కష్టపడకుండా 5 ఏళ్ళు ఎంజాయ్ చేశారు: ప్రజా మద్దతు కోల్పోయిన ఎమ్మెల్యేలకు ఇప్పుడు బదిలీ అంటున్నాడని చంద్రబాబు మండిపడ్డారు. అసాధ్యమని తెలిసి కూడా ప్రజా రాజధాని అమరావతిని విశాఖకు మార్చాలని చూశాడని ఆక్షేపించారు. అమరావతిపై నిర్ణయం తెలుగుదేశం ప్రభుత్వంలోనే అన్నట్లుగా నేడు సుప్రీంకోర్టు నిర్ణయం ఉందని చంద్రబాబు గుర్తు చేశారు. రాజకీయ వ్యవస్థనే అపవిత్రం చేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎవ్వరికీ రక్షణ లేదనటానికి ఎన్నో ఘటన లు ఉదాహరణలుగా ఉన్నాయని వాపోయారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ప్రజల కోసం కష్టపడకుండా 5 ఏళ్లు ఎంజాయ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దటం మాని, పాఠశాలలకు రంగులు కొట్టడమే అభివృద్ధి అంటున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. నిజమైన విద్యాభివృద్ధి ఏంటో తెలుగుదేశం ప్రభుత్వం చేసి చూపించిందన్నారు. బాధ్యత గల రాజకీయ నేతలంతా రామచంద్రయ్యలా ఆలోచన చేయాలని సూచించారు.
చంద్రబాబు సమక్షంలో చేరికలు - వైఎస్సార్సీపీపై నేతల సంచలన ఆరోపణలు
రూ. 12 లక్షల కోట్లు అప్పులు: ఇసుక, మద్యం దందాలతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని చంద్రబాబు ఆరోపించారు. ప్రజలు వైస్సార్సీపీ నాయకులను ప్రజలు అసహ్యించుకునే పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. జగన్ అవగాహన లేకుండా రాజకీయాలను అపవిత్రం చేశారని, జగన్ రాజకీయాల్లో లేకపోతే రాష్ట్రం విధ్వంసం అయ్యేది కాదని తెలిపారు. రూ.12 లక్షల కోట్ల అప్పులు తెచ్చి, రాష్ట్రాన్ని అప్పుల మయం చేశారని పేర్కొన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం చేపట్టిన వంద సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేశారని, తాము అభివృద్ధి చేసిన వ్యవస్థలను దెబ్బతీశారంటూ చందద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అరకు వైసీపీలో అసంతృప్తి జ్వాలలు - 'మాధవి వద్దు' అంటూ ఆందోళనలు
అధికారం కోసం ప్రయత్నించడం లేదు: రాష్ట్రంలో అభివృద్ధి మొత్తం కుంటుపడిందని ఆవేదన వ్యక్తం చేశారు. గాడి తప్పిన రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజలపై ఉందన్నారు. జగన్ రాజధాని మార్చలేడు, విశాఖపట్నం వెళ్లలేడని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఏప్రిల్ తర్వాత తెలుగుదేశం ప్రభుత్వమే వస్తుందని, మంచికి చెడుకీ తేడా తెలియని వ్యక్తి జగన్ అని విమర్శించారు. టీడీపీ - జనసేన అధికారం కోసం ప్రయత్నించడం లేదని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా, చంద్రబాబు సమక్షంలో అనంతపురం, చీరాల, బాపట్ల, పార్వతీపురం నియోజకవర్గాల నుంచి భారీగా వైఎస్సార్సీపీ నుంచి తెలుగుదేశంలోకి చేరారు.