Chandrababu Comments in Yuvagalam End Meeting: పాదయాత్రలు చేయడం ఈ దేశంలో కొత్తేమీ కాదని టీడీపీ అధినేత అన్నారు. ప్రజా చైతన్యం కోసం దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చైతన్యయాత్ర చేశారని చంద్రబాబు గుర్తు చేశారు. ఆ తర్వాత ఎన్నో రకాల యాత్రలు జరిగాయని ఆయన అన్నారు. కానీ, పాదయాత్రపై దండయాత్ర చేసిన సందర్భాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. తొలిసారి సైకో జగన్ పాలనలో దండయాత్రలు చూసినట్లు చంద్రబాబు విమర్శించారు.
విధ్వంస పాలనకు సీఎం జగన్ నాంది పలికారు అని చంద్రబాబు ఆరోపించారు. జగన్‌కు ఒక్క ఛాన్స్ ఇస్తే ఏపీ 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందన్నారు. ఏపీ వైఎస్సార్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్‌గా మారాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. అమరావతిని సర్వనాశనం చేసి మూడు ముక్కలాట ఆడారని విమర్శించారు. రుషికొండను బోడి గుండుగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం విల్లా కోసం 500 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టారని చంద్రబాబు వాపోయారు.
తాడేపల్లి తలుపులు బద్ధలు కొట్టే వరకు యుద్ధం ఆగదు: నారా లోకేశ్
ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి రంగం పూర్తిగా దెబ్బతిందని, స్వార్థం కోసం ఏపీని భ్రష్టుపట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్ధాల పునాదిపై నిర్మించిన పార్టీ వైఎస్సార్సీపీ అని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా, రైల్వేజోన్ సాధిస్తామన్న హామీ ఏమైందని చంద్రబాబు ప్రశ్నించారు. మద్యపాన నిషేధం అమలు చేశాకే ఓట్లు అడుగుతానని ప్రతిపక్షంలో జగన్ చెప్పారని చంద్రబాబు గుర్తు చేశారు.
జగన్ రాజకీయాలకు అనర్హుడని చంద్రబాబు దుయ్యబట్టారు. వైసీపీ విముక్త రాష్ట్రంగా ఏపీ తయారు కావాలన్నారు. వైసీపీకి ఒక్క ఓటు వేసినా ఏపీకి శాపంగా మారుతుందని అన్నారు. జగన్ చేసిన తప్పులు ఏపీకి శాపంగా మారాయని, ఏపీలో ఓట్ల దొంగలుపడ్డారని ఎద్దేవా చేశారు. ఓట్లు ఉన్నాయో లేదో ప్రజలు పరిశీలించుకోవాలని ఆయన సూచించారు.
వైసీపీ పాలనలో ఏపీ అంధకారం - మన భవిష్యత్‌ను మనమే నిర్మించుకోవాలి: పవన్ కల్యాణ్
ఏపీ ప్రజలకు ఉజ్వల భవిష్యత్ కల్పిస్తామని టీడీపీ అధినేత భరోసానిచ్చారు. ఉద్యోగులకు న్యాయం చేసే బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు. టీడీపీ - జనసేన పొత్తు చరిత్రాత్మకం కానుందని అన్నారు. ఈ పొత్తు ఏపీకి అవసరమని స్పష్టం చేశారు. అధినాయకత్వం ఆదేశాలను టీడీపీ -జనసేన శ్రేణులు పాటించాలని కోరారు. టీడీపీ -జనసేన శ్రేణులు కలిసి పనిచేయాలని సూచించారు.
త్వరలో ఉమ్మడి మేనిఫెస్టో తయారు చేస్తామని చంద్రబాబు వెల్లడించారు. త్వరలోనే అమరావతి, తిరుపతిలో సభలు నిర్వహిస్తామని వెల్లడించారు. అమరావతి లేదా తిరుపతి సభలో మేనిఫెస్టో ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే మహాశక్తి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. భవిష్యత్తు కార్యక్రమాలపై అధ్యయనం చేస్తామని అన్నారు. ఏపీలో జరుగుతున్న కురుక్షేత్ర యుద్ధంలో వైసీపీ ఓటమి ఖాయమని అభిప్రాయం వ్యక్తం చేశారు.
"రాష్ట్రంలో ఓట్ల దొంగలుపడ్డారు. టీడీపీ -జనసేన సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారు. మీరు ఒక త్యాగానికి సిద్ధమైతే మేము వంద త్యాగాలకు సిద్ధం. త్వరలో ఉమ్మడి మేనిఫెస్టో తయారు చేస్తాం. అమరావతి, తిరుపతిలో సభలు నిర్వహించి, మేనిఫెస్టో ప్రకటిస్తాం. ఇప్పటికే మహాశక్తి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము." -చంద్రబాబు, టీడీపీ అధినేత
సమయం లేదు మిత్రమా - విజయమో వీర స్వర్గమో తేల్చుకుందాం: బాలకృష్ణ