మహారాష్ట్రలో కొవిడ్ ఉద్ధృతి ఎంతమాత్రం తగ్గనందున లాక్‌డౌన్ వైపే మొగ్గు చూపారు సీఎం ఉద్ధవ్ ఠాక్రే. వైరస్ కట్టడికి చేపట్టాల్సిన చర్యలపై శనివారం వర్చువల్గా అఖిలపక్ష సమావేశం నిర్వహించారు ఠాక్రే. ఉద్ధవ్ నిర్ణయాన్ని మిత్రపక్షాలు కాంగ్రెస్, ఎన్సీపీ సమర్థించాయి.
అయితే లాక్‌డౌన్ విధించాలనే అభిప్రాయాన్ని వ్యతిరేకించారు మాజీ సీఎం ఫడణవీస్. లాక్డౌన్కు ముందు కరోనా ప్రభావిత ప్రజలకు ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని భాజపా భావిస్తున్నట్లు రాష్ట్ర భాజపా అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ తెలిపారు.
కాగా, ఆర్థిక ప్యాకేజీ రూపొందించడానికి సోమవారం సమావేశం కానున్నట్లు ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ తెలిపారు. లాక్‌డౌన్‌పై సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సమర్థిస్తామని కాంగ్రెస్ నేత, మంత్రి అశోక్ అన్నారు. అయితే అది గతేడాదిలా సమస్యాత్మకంగా ఉండకూడదని చెప్పారు.
ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరని నేపథ్యంలో మరో 2 రోజుల పాటు పరిస్థితిని క్షుణ్నంగా పరిశీలించాలని సీఎం నిర్ణయించారు. ఈ మేరకు రేపు టాస్క్ ఫోర్స్ సమావేశం కానుంది. ఆ తర్వాతే లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఇదీ చూడండి: 'కేంద్ర వైఫల్యమే వైరస్ వ్యాప్తికి కారణం'